రాజంపేట టీడీపీ టికెట్ సరే…వైసీపీకి ఏమయ్యిందో…?

Rajampeta TDP MLA Meda Mallikarjuna Reddy Joins YSRCP

కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశించిన తానా ప్రెసిడెంట్ సతీష్ వేమనకు నిరాశే ఎదురయింది. రాజంపేటలో ఆయన బలమైన అభ్యర్థి కారని అంచనా వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు సున్నితంగానే ఆ విషయాన్ని సతీష్ వేమనకు చెప్పేశారు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేశారన స్వయంగా సతీష్ వేమన తన ప్రకటించారు. రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి వైసీపీలో చేరిపోయారు. ఆ స్థానం ఖాళీ కావడంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవడానికి చంద్రబాబు.. వరుసగా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. అక్కడ పోటీకి అవకాశం కోసం రెడ్ బస్ సహ వ్యవస్థాపకుడు చరణ్ రాజు సహా, తానా ప్రెసిడెంట్ సతీష్ వేమనతో పాటు స్థానికంగా పట్టు ఉన్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు కూడా పోటీ పడ్డారు. టీడీపీ అధినేత చెంగల్రాయుడు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కడప జిల్లా మీద టీడీపీ అధినేత ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో జిల్లా మొత్తం మీద రాజంపేట ఒక్క చోటే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో బలమైన నేతల్ని పార్టీలోకి ఆహ్వానించారు.

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడమే కాక మంత్రి పదవి ఇచ్చారు. ఓ రకంగా కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలన్నీ ఆయనకే అప్పజెప్పారు. ఆదినారాయణరెడ్డి కూడా.. తన పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిని ఓడించి గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సాధించని విజయాన్ని అందుకునేలా చేసి బీటెక్ రవిని ఏమ్మెల్సీని చేసి ఆయన గెలుపులో కీలక పాత్రపోషించారు. మరో పక్క వైసీపీలో చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి టిక్కెట్ తనకే ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని ప్రకటించారు. అయితే రాజంపేట పార్లమెంటరీ జిల్లా వైసీపీ అధ్యక్షునిగా ఉన్న ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మాత్రం ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. జగన్‌నే నమ్ముకుని ఉన్నానని జగన్ మోసం చేయరని ఆయన అంటున్నారు. పైగా మేడా చేరిక కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. మేడాకు జగన్ టిక్కెట్ హామీ ఇవ్వలేదని ఎక్కడో ఓ చోట సర్దుబాటు చేస్తామని చెప్పినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.