జనసేన పార్టీ ప్రధాన అధికార ప్రతినిధులు, అధికార ప్రతినిధులతో సమావేశమమైన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును జాతీయ మీడియాలో రాసినట్లు, పలికినట్లు జగన్‌రెడ్డి అని పిలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నొచ్చుకోవడం హాస్యాస్పదమని అన్నారు. 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూర్చొని ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అని పిలవాలా లేక జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా ఉత్తి జగన్ అని పిలవాలా లేకపోతే ఉత్తుత్తి జగన్ అని పిలవాలో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని పవన్ ఎద్దేవా చేశారు.
జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఆయన కులాన్ని విమర్శించినట్లు కాదు అని పవన్ పేర్కొన్నారు. `ముస్లిం వ్యక్తులైన అబ్దుల్ కలాం గారిని, ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ గారికి అంతా గౌరవం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే గౌరవం ఇస్తాం. జగన్ తిరుపతి వెళ్లి పూజ చేస్తారో లేదో తెలియదు. ప్రసాదం తింటారో లేదో తెలియదు కానీ హిందూ సంప్రదాయాలను గౌరవిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. “ అని తెలిపారు.
ఈ సందర్భంగా తన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా వివరించారు. “రాజకీయాల్లోకి రావాలంటే ఎవరికైనా బలమైన ఆలోచన ధోరణి ఉండాలి. అందుకే జనసేన పార్టీ పెట్టకముందు చాలా మంది దళిత, బహుజన, కమ్యూనిస్టు ఉద్యమాల నాయకులతో మాట్లాడి, చరిత్రను చదివి అవగాహన చేసుకొని జనసేన పార్టీకి ఏడు సిద్ధాంతాలను తీసుకొచ్చాను. అందులో ముఖ్యమైనది కులాలను కలిసే ఆలోచన విధానం. ప్రస్తుత సమాజం కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా విడిపోయింది. ఏదైనా మాట్లాడితే మా కులాన్ని, మా మతాన్ని, మా జాతిని అంటున్నారు అని మాట్లాడుతున్నారు తప్ప సగటు మనిషి సమస్య గురించి ఆ కోణంలో ఆలోచించలేకపోతున్నారని అన్నారు.