కేంద్రం తెలంగాణకి మధ్య చెలరేగుతున్న మంట

కేంద్రం తెలంగాణకి మధ్య చెలరేగుతున్న మంట

వరి కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చెలరేగుతున్న మంట ఇప్పట్లో చల్లారేట్లు లేదు. ధాన్యాన్ని కొనుగోలుపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్‌తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..తెలంగాణలో పండించే వడ్లను కొంటరా.. కొనరా అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గోస తెలంగాణలోనే కాదు..దేశం మొత్తం ఉందన్నారు.. రైతు చట్టాలను రద్దు చేయండని ఏడాదిగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. వానాకాలం పంటనే కొనే దిక్కు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను ఎక్కడి నుంచి కొంటుందని ఎద్దేవా చేశారు.
చదవండి: టీఆర్‌ఎస్‌ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్‌.. నాగలితో ఎమ్మె‍ల్యే

కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఈ దుస్థితికి కారణం ఆ పార్టీలేనని విమర్శించారు. వాస్తవాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు మాట్లాడుతోందని మండిపడ్డారు. హంగర్‌ ఇండెక్స్‌లో భారత దేశం 101 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ దీన స్థితిలో ఉందన్నారు. బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తోందని మండిపడ్డారు.

‘ఐటీఆర్‌ ప్రాజెక్టు ఇవ్వమంటే ఇవ్లేదు.. ప్రతి జిల్లాకు నవోదయాలు ఇవ్వమంటే ఇవ్వలే. చాలా ఓపికతో ఉన్నాం. ఈ సభలో కూడా బీజేపీకి సీఐడీలు ఉన్నారు. నిన్న కూడా ప్రధానికి లేఖ రాసిన. వడ్లు కొంటరా, కొనరా అని అడిగితే ఉలుకు పలుకు లేదు. రైతులు ఇబ్బంది పడతారనే యాసంగిలో వడ్లు వేయొద్దని చెప్పిన. పదవులను చిత్తు కాగితాల్లా ఎన్నిసార్లు వదిలేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజీ పోరాటం చేస్తాం. అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టారు. కుల గణన చేయాలని తీర్మాణం చేసి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదు.

సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతున్నారు. సమస్యలను ఎత్తి చూపితే పాకిస్తాన్‌ అని విద్వేషాలు రెచ్చగొడుతోంది బీజేపీ. కరెంట్‌ కోసం తెలంగాణ 30ఏళ్లు ఏడ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే కరెంట్‌ సమస్య తీరింది. కరెంట్‌ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెబుతోంది. రైతు కడుపు నిండా కరెంట్‌ ఇచ్చేది తెలంగాణే. బీజేపీకి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి’ అని సీఎం కేసీఆర్‌ కేంద్రంపై నిప్పులు చెరిగారు.