ఆంధ్రప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికకు బలవంతంగా తాళికట్టిన ఓ యవకుడు ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పి.గన్నవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మామిడికుదురు మండలంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ అమలాపురంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. రోజూ కాలేజీకి వెళ్లొచ్చే సమయంలో అప్పన్నపల్లిలో పెట్రోల్ బంకులో పనిచేసే పెదపట్నం గ్రామానికి చెందిన కత్తిమండ మహేష్ బాలికపై మోజు పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మయికి మాయమాటలు చెప్పి అలా పరిచయాన్ని పెంచుకున్నాడు.
ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రేమిస్తున్నానని మహేష్ చెప్పిన సమయంలో ఆ బాలిక అందుకు నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్నఆ యువకుడు గతేడాది డిసెంబర్ 18న బాలికను తన ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టేశాడు. ఆ తర్వాత శోభనం పేరుతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. అయితే బాలిక మానసికంగా కుంగిపోవడంతో అనుమానం వచ్చిన అమ్మమ్మ ఏం జరిగిందని ఆరా తీసింది. అప్పుడు అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక అమ్మమ్మ ఈ నెల 5వ తేదీన మామిడికుదురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న ఆదివారం అతడిని అరెస్ట్ చేసి రాజోలు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆయన ఆదేశాలతో ఆ యువకుడిని రిమాండ్కు తరలించారు.