వరి పొలం గట్టున ఓ మోతుబరి . ఒకదాని తర్వాత ఒకటి గడ్డి మోపులు కూలీలకు ఎత్తుతూ వున్నాడు. ఆ గడ్డి మోపు వాళ్ళు అవసరం అయిన చోటుకి తీసుకెళ్తున్నారు. అలా వరసలో వెళుతున్న కూలీల్ని చూసి బాగా పని చేయిస్తున్నాను అనుకున్నాడు ఆ మోతుబరి. పైగా ఒక్కొక్కళ్ళు ఒక్కో గడ్డి మోపు మాత్రం మోస్తున్నారు. కానీ ప్రతి మోపుని నేనే ఎత్తి వారి నెత్తిన పెట్టాల్సి వస్తోంది అనుకున్నాడు. చివరకు ఆ గడ్డి మోపులు చేరాల్సిన చోటుకి చేరితే అంతా తన గొప్పదనమని, లేకుంటే కూలీలు సరిగ్గా పని చేయలేదని అనుకుంటాడు. ఈ వ్యవహారంలో ఆ మోతుబరి ఎక్కడా గడ్డి మోపు బరువు మోస్తున్న కూలీ గురించి ఆలోచించలేదు. ఒకవేళ ఆ ఆలోచన వచ్చినా అది వాళ్ళ పని కదా అని సరిపెట్టుకున్నాడు. సరిగ్గా ఈ మోతుబరిలాగే ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు .కూలీల పరిస్థితి అయిపోయింది విద్యార్థులది. కటువుగా వున్నా ఇది చేదు వాస్తవం. చదువుల భారాన్ని మోయలేక ఇప్పుడు చనిపోతున్న విద్యార్థుల మరణాలని కార్పొరేట్ కాలేజీ హత్యలుగా చెప్పుకుంటూ చేతులు దులుపుకుంటున్న వాళ్ళు ఆలోచించాల్సిన విషయాలు చాలా వున్నాయి.
చదువుల భారం మోయలేక ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ప్రతి ఒక్కరూ ఓ లేఖ రూపంలోనో, ఇంకో విధంగానే తమ మనోభారాన్ని చెప్పుకుంటున్నారు. ఆ లేఖల్లో ఏ ఒక్కరూ తమ తల్లిదండ్రుల్ని ద్వేషించడం లేదు. అసలు ఈ లోకమే వద్దు, ఈ చదువులే వద్దు అనడం లేదు,ఇలా చదవలేకపోతున్నాం అని మాత్రమే అంటున్నారు. ఇలా చదవలేకపోతున్నందుకు చచ్చిపోతూ కూడా తల్లిదండ్రులకే క్షమాపణలు చెబుతున్నారు. తన తమ్ముడికో అన్నకు ఆ చదువుల భారం అప్పగించి తల్లిదండ్రుల గౌరవం కాపాడమని చెప్పి మరీ చచ్చిపోతున్నారు. ప్రాణాలు తీసుకున్న ఏ విద్యార్థి కూడా ఏ కాలేజీ కి, ఏ ఉపాధ్యాయుడికి క్షమాపణ చెప్పడం చూడలేదు. పైగా వారిని దూషిస్తున్నారు కూడా. ఎందుకంటే సమస్య మూలం ఏమిటో తెలియక మాత్రమే.
ఓ కార్పొరేట్ కాలేజీ లో విద్యావిధానం ఎలా ఉంటుందో తల్లిదండ్రులకి తెలియదా ? తెలుసు. అందుకే పిల్లల్ని అక్కడ చేరుస్తున్నారు. పైగా పిల్లవాడిని తమ కాలేజీ లో చేర్చమని అడిగే వాళ్ళు కేవలం మార్క్స్, రిజల్ట్ గురించి మాత్రమే చెబుతారు. కంటి తుడుపుగా ఫుడ్ బాగుంటుందని చెప్తే చెప్పొచ్చు. పిల్లల్ని బాగా చదివిస్తామని అంటారే గానీ ప్రేమగా చూస్తామని, స్వేచ్ఛగా ఉండనిస్తామని చెప్పేవాళ్ళు వుండరు. తల్లిదండ్రులు కూడా ఈ విషయం అడగరు . పేరెంట్స్ మీటింగ్ కి వెళితే 100 కి 90 శాతం మంది తమ పిల్లల మార్క్స్ గురించి మాత్రమే అడుగుతున్నారు. అవసరం అయితే భయం పెట్టమంటున్నారు. కేవలం ఒక్క శాతం మాత్రమే పిల్లల మీద ఒత్తిడి తేవద్దు అంటున్నారు. ఒక్కోసారి ఆ ఒక్క శాతం కూడా కనపడరు. మన పిల్లల గురించి మనమే ఇలా ఉంటే ఇక వారిపై వ్యాపారం చేసే వాళ్ళు ఇంక ఎలా వుంటారు?.
ఈ విషయం తల్లిదండ్రులకి తెలియదు అనుకోవడం భ్రమ. వారికి తెలుసు. అయినా ఆ చావు కేక తమ ఇంటిలో వినపడదని ఓ అనాలోచిత ధీమా. ఆ ధీమా వెనుక పిల్లల సక్సెస్ తో వచ్చే సామాజిక గుర్తింపు, గౌరవం లాంటివి ఊరిస్తుంటాయి. అందుకే కాలేజీ లో చేరాక పిల్లవాడు ఏ సమస్య చెప్పిన ఎలాగోలా సర్దుకుపొమ్మంటారు. లేకుంటే పరువు పోతుందని భయం. అత్తారింటి ఆరళ్ళు చెప్పుకునే ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఇలాగే నచ్చజెప్పి చివరకి ఆ వేధింపులు భరించలేక ఆమె ఏదైనా చేసుకున్నప్పుడు అయ్యో ఇలా అనుకుంటే పంపేవాళ్ళమే కాదని అంటారు. వాళ్లకి వీళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు ఏమి అనుకుంటారో అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ పరువు గల రేపటి కోసం ఇప్పటి వర్తమానాన్ని బందీఖానా చేసేస్తున్నారు. ఆ రకంగా చూసినప్పుడు ఇవి కూడా ఓ రకంగా పరువు హత్యలే.
సహజంగా ఇలా రాసినప్పుడు ఇది కార్పొరేట్ కాలేజీల కుట్ర అని అనొచ్చు. కానీ ఆ కుట్రదారుల్ని పెంచి పోషిస్తోంది పాలకులు కాదు. పిల్లల తల్లిదండ్రులు. వారి ఆదరణ లేకే గ్రౌండ్ వున్న స్కూల్స్, కాలేజెస్ మూతపడుతున్నాయి. గాలివెలుతురు లేని కార్ఖానాలు కాలేజీలా వెలిగిపోతున్నాయి. ఇది మారాలంటే ముందు తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారాలి. అది మారితే అన్నీ మారిపోతాయి. డిమాండ్ లేని వస్తువు ని ఏ ఉత్పత్తదారుడు రూపొందించడు. అందుకు కార్పొరేట్ కాలేజీలు అతీతం కాదు.
- – కిరణ్ కుమార్