కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్లో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్న కమెడియన్ ఆలీ.. ఇప్పుడు నిర్మాతగా మారి ‘అందరూ బావుండాలి నేనుండాలి’ అనే మూవీ రూపొందిస్తున్నారు. మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన వికృతి మూవీ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అలీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ నిర్మిస్తున్నారు.
ఆలీ హీరోగా నటిస్తుండగా నరేష్, మౌర్యాని, మంజు భార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య, ప్రణవి మానుకొండ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.చక్కని మెసేజ్‌తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ చిత్రం సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటుడు, చిత్ర నిర్మాత ఆలీ మాట్లాడుతూ.. తమ సినిమాకు చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ రావడం ఆనందంగా ఉందని అన్నారు.
”సినిమా చూసిన ఐదుగురు సభ్యుల బృందం నాతోపాటు మా టీమ్‌తో మాట్లాడుతూ చాలాకాలం తర్వాత ఒక మంచి సినిమాని చూశాం అని ప్రశంసిస్తుంటే మేము పడిన కష్టం అంతా ఒక్కసారిగా మర్చిపోయి ఆనంద పడ్డాం. నేను ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాను. సెన్సార్ వారి ప్రశంసల తర్వాత ఈ సినిమా చేసే విషయంలో నా డెసిషన్ కరెక్టే అని అర్థమయింది. సూపర్‌స్టార్ కృష్ణ గారు, ప్రభాస్, సోనూ సూద్, సమంతలు మా సినిమా ప్రమోషన్లో పాలు పంచుకుని నన్ను ఆశీర్వదించినందుకు వారికి నా ధన్యవాదాలు. త్వరలోనే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేది ప్రకటిస్తాం” అని ఆలీ అన్నారు.