దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తున్న సినీ నటుడు అలీ తనకు ప్రస్తుతం క్రేజ్ ఉన్నప్పుడే రాజేకీయాల్లో ఎంటర్ అయ్యి ఎదో ఒక పదవి చేపట్టాలని ఆయన చూస్తున్నారు. అయితే తన రాజకీయ రంగ ప్రవేశం కోసం సరైన సమయం వేదిక కోసం చూస్తున్న నటుడు అలీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. దానికి ఊతం ఇచ్చేలా నెల రోజుల వ్యవధిలోనే ఆయన నిన్న రెండో సారి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన అలీ కొద్దిసేపు ముఖ్యమంత్రితో ముచ్చటించారు. దాదాపుగా పదిహేను నిమిషాల పాటు తన రాజకీయ భవిష్యత్‌పై చర్చించారు. గుంటూరు తూర్పు టిక్కెట్‌పై హామీ ఇస్తే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోవడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. అనంతరం వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడారు. తాను చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబును ఇటీవలి కాలంలో అలీ కలవడం ఇది రెండోసారి. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తోనూ అలీ సమావేశమయ్యారు. దీంతో అలీ వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే దీన్ని ఖండించిన అలీ.. తాను వైసీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కాగా, గుంటూరు అసెంబ్లీ సీటును అలీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో మైనారిటీలు ఉన్న నేపథ్యంలో టీడీపీ టికెట్ తనకు ఇవ్వాలని చంద్రబాబు ముందు అలీ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. గతంలో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ తనకు గుంటూరు-1 లేదా విజయవాడ-1 లేదా తన స్వస్థలం రాజమండ్రి సీటుతో పాటు మంత్రి పదవి ఇస్తానంటే ఏ పార్టీలో అయినా చేరతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ పార్టీలో టిక్కెట్ వస్తుందో ఆయనకు క్లారిటీ రాలేదు. ముందు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ పార్టీపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో మురళీమోహన్, అశ్వనీదత్ లాంటి వారితో లాబీయింగ్ చేసుకుని టీడీపీలో టిక్కెట్ తెచ్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతానికి అయన టీడీపీలోనే ఉన్నా పార్టీలో యాక్టివ్ కాదు, ఆయన ఇప్పుడు యాక్టివ్ అయితే గనుక సర్వేలు ఇతర అంచనాలను పరిగణనలోకి తీసుకుని దానికి తగ్గట్లుగా టిక్కెట్ ను ఎక్కడ కేటాయించాలో అక్కడ కేటాయిస్తామని కుదరకపోతే ఎమ్మెల్సీగా పంపిస్తామని టీడీపీ అధిష్టానం అలీకి ఆఫర్ ఇచ్చిందట. ఎందుకంతే అలీ ఆశిస్తున్న గుంటూరు తూర్పు విషయంలో టీడీపీకి చాలా ఇబ్బందులు . అక్కడ ఇన్చార్జ్గా ఉన్న మద్దాళి గిరి గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తు అక్కడ పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ సీటు మీద సందిగ్దత నెలకొంది.