మంత్రి పదవి కోసమే అలీ ప్రయత్నం !

Comedian Ali To Join TDP Party

కొద్ది రోజులుగా కమెడియన్ అలీ రాజకీయ ప్రవేశం జరగుతుందనే టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ రాజకీయ రంగ ప్రవేశంపై మీడియాతో పెద్దగా మాట్లాడని అలీ నిన్మ టీవీ9 కు ఇచ్చిన ముఖాముఖిలో మాత్రం తన ఆశలు అన్నీ వెళ్లబోసుకున్నారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే సరిపోదని మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిందేనని అలా ఇచ్చే పార్టీలో చేరతానని ఇందులో తనకు దాపరికాలు ఏమీ లేవంటున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంపై అలీ కన్ను ఉంది. ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ. ఎప్పుడూ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ ఉంటారు. తనకు అక్కడ సీటు ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తానని చెబితే ఆ పార్టీలో చేరిపోతానంటున్నారు. ఇదే ఆఫర్ కోసం ఆయన మూడు పార్టీల వద్దకు ఇప్పటికే పరుగులు పెట్టారు. కొన్నాళ్ల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అలీ కలిశారు. జనవరి 9వ తేదీన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. నిన్న నిర్మాత అశ్వనీదత్ తో కలిసి చంద్రబాబును కలిశారు.

ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ నేతలు షాక్‌ కు గురయ్యారు. పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన అలీ పవన్ కల్యాణ్‌తో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. రాజకీయంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారని, అలీ జనసేనలో చేరడం ఖాయమని జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి. నిజానికి అలీ తెలుగుదేశం సభ్యుడు రాజకీయంగా తటస్థంగా ఉన్నా ఆయన ఒకానొక సమయంలో తెలుగుదేశానికి ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆయన చేబుతున్నట్ట్టు మూడు పార్టీల్లో ఏ పార్టీ నుంచి టికెట్ దక్కినా అలీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆయన ఆశిస్తున్న గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ సీటు. అక్కడి ఎమ్మెల్యే ముస్తఫాను కాదని గుంటూరుకు ఎలాంటి సంబంధం లేని అలీకి జగన్ టిక్కెట్ ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఇక టీడీపీ అధినేత ఇస్తారా అంటే అదీ డౌటే !. ఇక ఉన్న ఏకైక ఆప్షన్ జనసేన మరి అలీ ఏమి చేస్తారో ?