నవ్వుల రారాజు బర్త్‌డే

నవ్వుల రారాజు బర్త్‌డే

హాస్యబ్రహ్మ…నవ్వుల రారాజు.. కామెడీ కింగ్‌..కామెడీకి బ్రాండ్ అంబాసిడర్‌.. అసలు ఏ పేరుపెట్టి పిలవాలి? ఆయన కనుబొమ్మ అలా ఎగరేస్తే చాలు ప్రేక్షకుడి పొట్ట చెక్కలవ్వాల్సిందే. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం పేరు తలుచుకుంటే చాలు మనం ఏమూడ్‌లో ఉన్నా చిరునవ్వు ఇట్టే వచ్చేస్తుంది.. దటీజ్ బ్రహ్మానందం. బహుశా అందుకే ఆయనకు చిన్నప్పుడే బ్రహ్మా..నందం అని పేరు పెట్టాశారేమో. టాలీవుడ్‌కు జంధ్యాల పరిచయం చేసిన తెలుగు మాస్టారు బ్రహ్మానందం బర్త్‌డే సందర్భంగా ఈ స్పెషల్‌ వీడియో మీకోసం…

కన్నెగంటి బ్రహ్మానందం అనే బ్రహ్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సత్తెనపల్లిలో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. విద్యాభ్యాసం తరువాత అత్తిలిలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు దక్కుతుంది. నటుడిగా బ్రహ్మానందంగా అరంగేట్రం చేసింది, తొలి వేషం వేసిందీ కూడా ఫిబ్రవరి 1వ తేదీనే కావడం విశేషం.

నరేష్ హీరోగా నటించిన తాతావతారం మూవీలో నటించారు. ఆ తరువాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఎవరగ్రీన్‌ క్లాసిక్‌ ’అహానా పెళ్లంట’ సినిమాలో అరగుండు బ్రహ్మానందంగా పండించిన హాస్యానికి జనం విరగబడి నవ్వారు. జయహో బ్రహ్మానందం అంటూ నవ్వుల రారాజుకి బ్రహ్మరథం పట్టారు. ఇక అది మొదలు తన మార్క్‌ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి..నవ్వించీ కరియర్‌కు తిరుగులేని బాట వేసుకున్నారు.

సినీ దర్శక నిర్మాతలకే కాదు టాప్‌ హీరోలకు కూడా బ్రహ్మానందం ఫ్యావరేట్‌గా మారిపోయాడు. అరగుండు, కిల్ బిల్ పాండే, కత్తి రాందాస్‌, ఖాన్ దాదా, శంకర్ దాదా ఆర్ ఎంపి, నెల్లూరి పెద్దారెడ్డి, గ‌చ్చిబౌలి దివాక‌ర్‌, లవంగం, భట్టు , మైఖెల్ జాక్సన్‌, ప‌ద్మశ్రీ‌, ప్రణ‌వ్‌, జ‌య‌సూర్య లాంటి పాత్రల్లో ఆయన పండించిన అద్భుతమైన కామెడీ నభూతి నభవిష్యతి. దశాబ్దాలు గడిచినా ఆ పాత్రలు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వులు పువ్వులు విరగబూయాల్సిందే. అలాగే అలనాటి హీరోలు మొదలుమొత్తం మూడు తరాల వారితో కలిసి కామెడీ పండించిన భాగ్యం దక్కిన ఏకైక కమెడియన్‌ ఆయన. అంతేకాదు బ్రహ్మానందం గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు కూడా.

మరోవైపు సోషల్‌ మీడియాలో బ్రహ్మానందం ఇమేజ్‌ అసామాన్యమైంది. సందర్భం ఏదైనా బ్రహ్మానందం ఇమేజ్‌లేని మీమ్స్‌ లేవంటే అతిశయోక్తి లేదు. ఆయన పలికించని భావం, రస ఉందా అసలు. ‍బ్రహ్మానందం పలికించిన హావభావాల ప్రాధాన్యత పాపులారిటీ అలాంటి మరిది. జంబలకిడి పంబ, చిత్రం భళారే విచిత్రం, మనీ, వినోదం అనగనగ ఓ రోజు, మన్మధుడు, అతడు, దూకుడు, అదుర్స్‌, రేసుగుర్రం ఇలా.. జాతిరత్నందాకా ఆయన సినీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది.

ఏకంగా ఐదు నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆయన విశిష్ట సేవలను గురించిన భారత ప్రభుత్వం 2010లో పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒక ఫిలిమ్ ఫేర్ అవార్డు సైతం అందుకున్నాడు. అలాగే 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మధ్య కాలంలో సినిమాలను తగ్గించిన బ్రహ్మానందం తనలోని మరో కళా నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. అద్భుత పెన్సిల్‌ స్కెచ్‌లతో ఫ్యాన్స్‌తో ఔరా అనిపించుకుంటున్నారు బ్రహ్మానందం.