తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు నవ్వులు పంచిన హాస్య నటి విద్యుల్లేఖ రామన్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఫిట్నెస్, న్యూట్రీషన్ నిపుణుడు సంజయ్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు అభిమానులకు షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో పెళ్లికి ముస్తాబు అవుతున్నారు. ఆగస్టు 26న రోకా ఫంక్షన్ కూడా జరిగినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
“రోకా పూర్తయింది. అతికొద్ది మంది మధ్య మాత్రమే ఈ వేడుక జరిగింది. ఈ వేడుకలో మేం మాస్కులు ధరించాం, కేవలం ఫొటోలకు స్టిల్స్ ఇచ్చే సమయంలో మాత్రం వాటిని తీసివేశాం. మాకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు” అని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు. కాగా లాక్డౌన్లో ఆమె పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి కేటాయించారు. అధిక బరువును తగ్గించుకోవడం కోసం తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు స్లిమ్‌గా తయారై అందరినీ ఔరా అనిపించారు.