ఆంధ్రాబ్యాంక్ విలీనాన్ని కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ…విజయవాడ వన్ టౌన్ ఆంధ్ర బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ధర్నా చేపట్టాయి. 90 వేల శాఖలు ఉన్న అంధ్రాబ్యాంక్ ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని నేతలు మండిపడ్డారు. మోదీ సర్కార్ విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యూనియన్ బ్యాంకులో ఆంధ్రాబ్యాంకు విలీనంపై వామపక్షాలు భగ్గుమన్నాయి.
కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తిరుపతి వరదయ్యపాళెం లో సీపీఐ నాయకులు నిరసనకు దిగారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయానికి గోల్డ్ లోన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో పక్క ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని వ్యతికిస్తూ విశాఖలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. సీతమ్మధారలోని రీజనల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. బ్యాంక్ సిబ్బంది ఆందోళనకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. 98ఏళ్ళ చరిత్ర కలిగిన బ్యాంక్ ను విలీనం చేయడం అన్యాయమన్నారు ఉద్యోగులు.
మరోవైపు,నగరంలోని వివిధ బ్రాంచ్ ల దగ్గర ఆందోళనలు కొనసాగాయి. ఇక కార్పోరేట్ ఊడిగం చేసేందుకే మోడీ ప్రభుత్వం బ్యాంకులను విలీనం చేస్తుందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చని కేంద్రం, బ్యాంకుల విలీనంతో మరోసారి ఏపీకి అన్యాయం చేస్తుందని రామకృష్ణ మండిపడ్డారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రా బ్యాంకుని యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం సరికాదన్నారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా..ఒంగోలులో జరిగిన నిరసనలో రామకృష్ణ పాల్గొన్నారు