తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి వ్యతిరేకంగా పోరాడి సంచలనం సృష్టించిన లగడపాటి రాజగోపాల్ చివరకు రాజకీయ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఎన్నికలకు ముందు సర్వేలంటూ మరో హడావిడి మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు సర్వే చేసి తాను చూపిన వారే విజయ కేతనం ఎగరవేస్తారనే స్థాయికి ఎదిగారు. అంతకుముందు పలు రాష్ట్రాల ఎన్నికల్లో సర్వేలు చేసి విజయవంతం అయిన లగడపాటి ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సర్వేలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. కనీసం ఆయన చెప్పిన దానికి ఇంచుమించు ఫలితాలు కూడా రాకపోవటంతో లగడపాటితో పాటు రాజకీయ వర్గాలన్నీ షాక్ అయ్యాయి. ప్రజా కూటమికి 65 స్థానాలు వస్తాయని మరో 10 స్థానాలు పెరగొచ్చు లేదా తగ్గే అవకాశం కూడా ఉందన్న లగడపాటి కూటమిలోని టీడీపీ పోటీ చేసిన 13 స్థానాల్లో ఇద్దరు స్వతంత్రులు గెలుస్తారని, మరోచోట ఎంఐఎం పోటీలో ఉండగా మిగతా 12 స్థానాల్లో టీడీపీ-టీఆర్ ఎస్ మధ్య పోటీపోటీ ఉంటుందని ఇందులో 7 స్థానాల్లో టీడీపీ విజ్జయం సాధిస్తుందని తెలిపారు. అయితే తీరా ఫలితాల అనంతరం కథ అడ్డంతిరగటంతో తెలంగాణలో మరోసారి లగడపాటి లోకువ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు సర్వేలు చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడనే నెపంతో లగడపాటిపై ఎన్నికల సంఘంలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. లగడపాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి సచివాలయంలో ఎన్నికల కమీషన్ చైర్మన్ రజత్ కుమార్ కి తన ఫిర్యాదు అందించాడు. అబద్దపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి – గందరగోళ పరచడానికి ప్రయత్నించారంటూ ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో లగడపాటికి ఊహించని దెబ్బ తగిలిందనే చెప్పాలి.