దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం లేక ఇబ్బందులు పడుతోంది. తల్లి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని పార్టీని ముందుండి నడిపిస్తాడనుకున్న రాహుల్ గాంధీ మధ్యలోనే కాడి వదిలేశారు. రాహుల్‌కే తిరిగి పగ్గాలు అప్పగించాలని కొందరు, లేదు ఫుల్ టైమ్ అధ్యక్షుడు కావాలంటు ‘జీ–23’ నేతలు అధిష్టానంపై ‘పోరు’పెట్టారు.
ఇక ఈ పంచాయితీని పెంచడం ఇష్టం లేక యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీయే తాత్కాలికంగా పార్టీ అధ్యక్ష స్థానంలో కొనసాగుతున్నారు. ఇలా పార్టీ అధిష్టానంలో సఖ్యత కొరవడటంతో శ్రేణులు నీరుగారిపోతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ 137వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే, పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన అటు సోనియాకు, సీనియర్ నేతలకు, కార్యకర్తలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం జెండా ఎగురవేస్తున్నప్పుడు అది ఒక్కసారిగా కిందపడిపోయింది. జెండా ఆవిష్కరణ చేయాల్సిన సోనియా దాన్ని నేలపై పడకుండా చేతులతో పట్టుకున్నారు. అక్కడున్న సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసిన ఆమె జెండాను చేతులతో పైకెత్తి పార్టీ శ్రేణులకు చూపించి మిగతా కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.