లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత క్రమ క్రమ పుంజుకున్నాయి. ఫార్మా, ఫైనాన్షియల్, ఐటీ షేర్ల అండతో సూచీలు స్థిరంగా లాభాల వైపు అడుగువేశాయి. ఒమిక్రాన్‌ భయాలు వెంటాడినప్పటికీ.. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడటంతో లాభాల్లో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 334.86 పాయింట్లు(0.59%) పెరిగి 57,459.17 వద్ద ఉంటే, నిఫ్టీ 92.50 పాయింట్లు(0.54%) లాభపడి 17,096.30 వద్ద నిలిచింది.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.97 వద్ద ఉంది.ఇక నిఫ్టీలో టెక్ మహీంద్రా, సిప్లా, డాక్టర్ రెడ్డి లేబొరేటరీస్, యుపీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో ముగిస్తే.. హిందాల్కో ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఒఎన్‌జిసీ, గ్రాసీమ్ ఇండస్ట్రీస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మెటల్ మినహా ఇతర అన్ని రంగాల సూచీలు 1 శాతం లాభపడ్డాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి.