కాంగ్రెస్ నేత రాంచంద్రారెడ్డి హత్య కేసులో ట్విస్ట్….

తెలంగాణ జడ్చర్ల కాంగ్రెస్ సీనియర్ నేత రాంచంద్రారెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేమంటే.. రాంచంద్రారెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డి అతడి మృతదేహంతో కారులో ఏకంగా వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. చివరికి ఏం చేయాలో ఏం అర్థంకాకపోవడంతో కారులో అతడి మృతదేహాన్ని పెంజర్లలో వదిలి పరారైపోయాడు.

అయితే తాజాగా పోలీసుల వెల్లడించిన వివరాలను బట్టి చూస్తే… రాంచంద్రారెడ్డి, ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డి మధ్య భూవివాదం నెలకొందని.. పెద్దల సమక్షంలో కుదిరిన ఒప్పందంలో భాగంగా తనకు 5 ఎకరాలు ఇవ్వాలని ప్రతాప్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. అందుకు అంగీకరించిన రాంచంద్రారెడ్డి భూమికి బదులుగా రూ.2.75 కోట్లు ఇస్తానని చెప్పి దస్తావేజులు, కోర్టు కాపీలు తీసుకున్నారు. అదే సమయంలో తనకు ఇస్తామని చెప్పిన మొత్తం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో ప్రతాప్‌రెడ్డి తీవ్ర అసహనానికి లోనై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం అందుతుంది.

అంతేకాకుండా ఆ వివాదాస్పద భూమిలో ప్రతాప్ రెడ్డి తన తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా రాంచంద్రారెడ్డి అడ్డుపడ్డాడు. దీంతో అతడిపై పగ పెంచుకున్న ప్రతాప్‌రెడ్డి.. రాంచంద్రారెడ్డిని అడ్డుతొలగించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఓ ప్లాన్ ప్రకారం ప్రకారం రాంచంద్రారెడ్డిని చర్చలకు పిలిచి షాద్‌నగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో వెంట తెచ్చుకున్న కత్తెర, కొడవలితో అతడి పొట్ట, మెడపై పలుమార్లు పొడిచాడని.. ఆ సమయంలో డ్రైవర్ విజయ్ వాహనం నడుపుతున్నాడని కూడా పోలీసులు విచారణలో వెల్లడైనట్లు విరించారు. కాగా ఇలాంటి సమయంలో షాద్‌నగర్ వద్దకు వచ్చేసరికి రాంచంద్రారెడ్డి మృతి చెందాడని… అదే సమయంలో మృతదేహాన్ని కారులోనే ఉంచుకొని కేశంపేట, కడ్తాల్ వంటి ప్రాంతాల మీదుగా దాదాపు వంద కిలోమీటర్లు తిప్పాడని కూడా తేలినట్లు పోలీసులు వివరించారు. చివరికి కొత్తూరు మండలంలోని పెంజర్లలో వాహనాన్ని వదిలేసి ప్రతాపరెడ్డి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రతాప్‌రెడ్డితోపాటు డ్రైవర్ విజయ్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.