తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పిన జోస్యం నిజమయ్యేలానే కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ మారతారు అన్నాడు. అన్నట్లే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఇంకా చాలా మంది ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని విశ్వేశ్వర్‌రెడ్డి అంటున్నారు. ఇంత కాలం పార్టీలో తొక్కి పెట్టిన అసంతృప్తులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి విశ్వేశ్వర్ రెడ్డి తను బయట పెట్టిన అంశాలతో అటా ఇటా అని ఆలోచిస్తున్న టీఆర్ఎస్ నేతల మనసుల్లో మరింత ఉత్సాహం తెచ్చి పెట్టే ప్రయత్నం చేశారు. వ్యూహాత్మకంగా కేకే, జితేందర్ రెడ్డి, వినోద్ లాంటి వాళ్ల పేర్లను తన ప్రెస్మీట్లో మాట సందర్భంలో ప్రస్తావించి మరింత టెన్షన్ వాతావరణం తెచ్చి పెట్టారు.
టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ సొంత వ్యాపార సంస్థ. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదని, జీ హూజూర్ అంటూ కాలం వెళ్లదీయాలని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులకు ఆత్మగౌరవం కొరవడటంతో ఆ పార్టీలో ఇమడలేకనే కాంగ్రెస్ లో చేరా అని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను రాజీనామా చేశాక టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితిలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయన కళ్లకు కట్టినట్లు చెప్పారు. అధికారం మొత్తం ప్రగతి భవన్లో కేంద్రీకృతమై ఉంటుందని కానిస్టేబుల్‌ను బదిలీ చేయాలన్నా హోంమంత్రికి అధికారాలు ఉండవని చెప్పుకొచ్చారు. అంతేకాక టీఆర్ఎస్ అంటే ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అని జితేందర్‌రెడ్డి ఓ సందర్భంలో తనతో అన్నారని తెలిపారు.
తమ మంత్రిత్వ శాఖల్లో జరిగే బదిలీలు, ఇతర పరిణామాలను ఆయా శాఖల మంత్రులు మర్నాడు పత్రికల్లో చదివి తెలుసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. పోలీసు అధికారుల బదిలీల గురించి హోం మంత్రి నాయినికి తెలియదని, బడ్జెట్ నోట్ చదివే వరకు ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు బడ్జెట్లోని కేటాయింపులు తెలియని విచిత్ర పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అయితే పార్టీ మారతారని పేర్లు బయటకు వచ్చిన తర్వాత వారు ఆయా పార్టీల్లో ఉండడం అంటే సాధ్యమయ్యే పని కాదు. ఓ పద్దతి ప్రకారం ఆయా పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలపై ఇతర పార్టీలు ఇలా మైండ్ గేమ్ ప్రారంభించి తమ పార్టీలోకి లాగేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి మైండ్ గేమ్ టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. సొంత పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడారని తెలిసిన నేతలని క్షమించలేరు అలాగని బయటకు నెట్టేయలేరు. దీంతో ఎలాగోలా వారే హస్తం అందుకుంటారని భావిస్తున్నారు.