పాడె మీద పార్టీలకి కొత్త రక్తం ఎక్కిస్తారట !

Ap BJP and Congress leaders trying to boost up their parties

ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. ఇప్పటికే ఏపీ రాజకీయం ప్రధానంగా అధికార ప్రతిపక్షాల మధ్య తిరుగుతుండగా ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టి ఏపీలో భూస్థాపితం అయిన కాంగ్రేస్, హామీలు ఇచ్చి వాటిని అమలు పరచకుండా అపఖ్యాతిని మూటకట్టుకున్న బీజేపీలు ఇప్పుడు తిరిగి ఏపీలో చక్రం తిప్పడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే కాకతాళీయంగా ఏపీలోని బెజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య సారూప్యత అబ్బురపరుస్తోంది. అవేమిటంటే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, విభజనను తీవ్రంగా వ్యతిరేకించి, ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ ను వీడి, ఇటీవల తిరిగి సొంత గూటికి చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఉదయం విజయవాడలో ఉమెన్ చంద్ అధ్యక్షతన జరగనున్న ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం కోసం విజయవాడ వచ్చారు. ఇదే సమయంలో ఆయన క్యాబినెట్ లో మంత్రిగా ఉండి ఇప్పుడు ఏపీ బీజేపీకి అద్యక్ష్యుడిగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ అధ్యక్షతన విజయవాడలో బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరుగుతోంది. అయితే ఇదొక్కటే కాక ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ల ఇంచార్జ్ లు ఊమెన్ చాందీ, మురళీధరన్ లు ఇద్దరిదీ కేరళ నే కావడం ఇప్పుడు మరో కొసమెరపు. రెండు పార్టీలు దాదాపు చచ్చుపడిపోయిన స్టేజ్ లో ఉన్నాయి. రెండు పార్టీలను ఇద్దరు కాంగ్రెస్ నేపధ్యం గల నేతలు జాకీలు వేసి లేపడానికి కేరళ నేతల ఆధ్వర్యంలో కష్టపడడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.