తెరపై వీరులు….నిజ జీవితాల్లో మాత్రం ?

reel life heroes are not at all real life heroes

గ్రీన్ చాలెంజ్, పేరు బాగుంది తెలంగాణకి హరితహరం పేరుతో ప్రారంభించిన కార్యక్రమానికి ఒక గ్రీన్ చాలెంజ్ పేరుతో సెలెబ్రిటీలు ఒకరికొకరు విసురుకుంటున్న చాలెంజ్లతో సోషల్ మీడియా మారు మోగుతోంది. టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఇప్పుడు ఇంటి పెరట్లోనో ఫామ్‌హౌసుల్లోనో మొక్కలు నాటి వాటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తమకు ఎవరో చాలెంజ్ విసిరితే వారి చాలెంజ్‌కు అనుగుణంగా మొక్కలు నాటి..మరో ముగ్గురికి చాలెంజ్ విసురుతున్నారు. చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకూ సూపర్ స్టార్లందరూ, నాయిని నరసింహా రెడ్డి నుండి పవన్ కళ్యాన్ దాకా అందరూ చాలెంజ్‌లు తీసుకున్నారు. మొక్కలు నాటేశారు. మళ్లీ చాలెంజ్ లు చేస్తున్నారు.

టాలీవుడ్‌ స్టార్లలో పర్యావరణం, మొక్కలు నాటడంపై ఇంత ఆసక్తి ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా ప్రస్తుతం మొక్కల నాటులు సాగుతున్నాయి. నిజం చెప్పాలంటే గతంలో ఎప్పుడూ ఇలాంటి చాలెంజ్‌లో స్టార్లు పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. తెలంగాణలో హరిత హారం కార్యక్రమానికి ప్రచారం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత.. తొలిసారి మొక్కలు నాటి.. ముగ్గురికి చాలెంజ్ చేశారు. ఆ ముగ్గురు మరో తొమ్మిది మందికి.. ఆ తొమ్మిది మంది మరో ఇరవై ఏడు మందికి సవాల్ చేస్తూ పోతున్నారు. అందరూ ప్రముఖులే కాబట్టి… మీడియాలో హైలెట్ అయిపోతున్నాయి. మీడియా సంస్థల యజమానులు కూడా ఇందులో యాక్టివ్‌గా ఉండటం ఈ సారి విశేషం.

అయితే నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఒకరకంగా ఇవన్నీ టైం వేస్ట్ యవ్వారాలు అని నేనంటాను, అంటే నేను మొక్కలు నాటడాన్ని తప్పు పట్టట్లేదు కానీ ఇందులో ఉన్న శ్రద్ద మరి వరే విషయాల్లో లేదెందుకని అడుగుతున్నా ? అంటే మొక్కలు ఏవో మూడు కొనేసి మీడియా ని పిలిచి లేదా మన ఇళ్ళలో ఉన్న డీఎస్ఎల్ ఆర్ కెమెరాలు రెడీ చేసేసి ఆ మూడు మొక్కలు నాటేసి వదిలేస్తే అయిపోయిందా ? ఎంత గొప్ప వారు సర్ మీరు ? ఎపీకి ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వకుండా బీజేపీ మాట తప్పి హోదా ఇస్తానని మభ్యపెట్టి ఏమీ ఇవ్వం పొండి అన్నప్పుడు ఒక ఏపీ పౌరుడుగా నటుడు శివాజీ ముందుకు వచ్చాడు. ఇంకెవరు వచ్చారు సార్, ఎక్కడో తెలంగాణాలో ఉండే సంపూర్నేష్ బాబు వైజాగ్ వచ్చి నిరసన చేయడానికి సిద్డంఅయ్యాడే అప్పుడు మీకేమయ్యింది సార్ ?

అంటే ఫొటోలకి ఫోజులిచ్చి చేతులు దులిపేసుకునే పనులకి చూపే శ్రద్దలో పావు వంతు కాదు కాదు పదో శాతం శ్రద్ద చూపి ఇప్పుడు ఫొటోలకి ఫోజులిచ్చి ఐ చాలెంజ్ టు మిస్టర్ సో అండ్ సో అని చెప్పే బదులు మీరంతా కలిసి ఒక్క రోజు రోడ్డు మీదకి వచ్చి మీ మీ అభిమానులకి పిలుపునిచ్చి చూడండి. అష్టదిగ్బంధనం అనే మాట వింటుంటారు కదా అది అది జరుగుతుంది. కానీ మనకి అవన్నీ ఎందుకు పొద్దున్నే లేచామా ? షూట్ కి వెళ్ళామా ? ఇంటికోచ్చామా ? పడుకున్నామా ? ఇవి చాలు కదా, మధ్యలో ఇలాంటి గ్రీన్ చాలెంజ్ లు ఏమైనా వస్తే రెండు మూడు ఫోటోలు దిగేసి పక్కకొచ్చేస్తే చాలు. ఎందుకు సార్ ఇవన్నీ ఎవరినివారు ఓ మొక్క నాటడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చేసి… తెలంగాణను హరితవనం చేస్తారని ఆశించడం అత్యాశే. అలాంటి సందేశాలు కూడా.. సెలబ్రిటీల నుంచి రావడం లేదు. ఫన్ ప్రోగ్రాంలా చాలెంజ్‌ తీసుకుంటున్నారు.. ఇస్తున్నారు అంతే.. ! సంతోష పెట్టడానికి.

ఇలా రాస్తున్నందుకు ఆయా హీరోల అభిమనులు నన్ను తిట్టుకోవచ్చు గాక, కానీ నిజం మీరు ఒప్పుకోక తప్పదు. ఈ గ్రీన్ చాలెంజ్ బదులు ఏదైనా అడాప్టింగ్ చాలెంజ్ లు చేయొచ్చు కదా, మనకి వీలయినంతలో ఒక ప్రభుత్వ బడినో, లేక ఆసుపత్రినో అదీ కుదరకపోతే ఒకరిద్దరు అనాదః పిల్లలనో దత్తత తీసుకోవచ్చు. చెప్పండి ఇప్పుడు గ్రీన్ చాలెంజ్ చేసిన, చేయించుకుంటున్న వారికి మనం చెప్పినవి ఏమన్నా అనితర సాధ్యమైన పనులా ? కాదుగా ! పోనీ ఈ గ్రీన్ చాలెంజ్ మహత్తర కార్యక్రమమే అనుకుందాం సెలెబ్రిటీలు ఓ మొక్క నాటడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చేసి… తెలంగాణను హరితవనం చేస్తారని ఆశించడం అత్యాశే. అలాంటి సందేశాలు అయినా సదరు సెలబ్రిటీల నుంచి వస్తున్నాయా ? లేదే వారు దానిని ఒక ఫన్ ప్రోగ్రాంలా తీసుకుంటున్నారు.. ఇస్తున్నారు అంతే.. !

అయినా మా పిచ్చి కానీ ఎంత చెప్పినా మీరు వింటారా ? లేదే … మీకు మీ అభిమాన హీరో, నాయకుడు ఏది చేస్తే అది మీకు గొప్ప కదా…

                                                                వశిష్ట