కాంగ్రెస్‌ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు: హరీశ్‌రావు

Congress leaders show vindictiveness in the palm of their hand: Harish Rao
Congress leaders show vindictiveness in the palm of their hand: Harish Rao

కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. మాటలు చెప్పే సర్కార్‌ కావాలా?.. చేతల సర్కార్‌ కావాలా? అని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్‌ గెలిచేది లేదని తెలిపారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లటం ఖాయమని హరీశ్ రావు జోస్యం చెప్పారు.

నారాయణపేట జిల్లాలో పర్యటించిన హరీశ్ రావు.. కోస్గిలో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. “3 వేల తండాలను సీఎం కేసీఆర్‌ గ్రామపంచాయతీలుగా మార్చారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు మహిళల కష్టాలు తీర్చారు కేసీఆర్‌. కాంగ్రెస్‌ పాలనలో ‘నేను రాను బిడ్డో.. సర్కార్‌ దవాఖానాకు’ అని పాడుకునే వారు. బిడ్డ కడుపున పడినప్పటి నుంచే ప్రభుత్వ సహాయం అందుతోంది. గర్భిణీలకు రూ.12 వేలు ఇస్తున్నాం, కాన్పు తర్వాత కేసీఆర్ కిట్‌ ఇస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణా జలాలు వస్తాయి. ప్రస్తుతం కృష్ణా నుంచి కొడంగల్‌కు తాగునీరు వస్తోంది, త్వరలోనే సాగునీరు వస్తుంది. 3 గంటలు విద్యుత్‌ చాలు అనే రేవంత్‌ రెడ్డి కావాలా… 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్‌ కావాలా? అని హరీశ్ రావు పేర్కొన్నారు.

12 లక్షల మంది ఆడపిల్లల వివాహాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేశారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పొరుగున ఉన్న కర్ణాటకలో ఎలాంటి పథకాలు ఉన్నాయో తెలుసుకోవాలని.. కర్ణాటకలో వృద్ధాప్య పింఛనుగా రూ.600 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతుబంధు, రూ.4 వేల పింఛను ఎందుకు ఇవ్వట్లేదని.. కర్ణాటకలో రైతులకు 7 గంటల విద్యుత్‌ కూడా ఇవ్వటం లేదని చెప్పారు.