Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కులభూషణ్ జాదవ్ తో భేటీ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాకిస్థాన్ వ్యవహారశైలిపై వివాదం కొనసాగుతోంది. దీనిపై పార్లమెంట్ లో భారత రాజకీయ పక్షాలన్నీ ఏకమై పాక్ తీరును ఖండించాయి. అదే సమయంలో భారత ప్రభుత్వ వైఖరిని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది కూడా. కులభూషణ్ కుటుంబ సభ్యులు ఆయన్ను కలవడానికి భారత్ అనుసరించిన మార్గం సరైనది కాదని కాంగ్రెస్ అంటోంది. పాక్ బుద్ధి తెలిసి కూడా ఆ దేశంతో దౌత్యానికి భారత ప్రభుత్వం ఎలా అంగీకరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన రెండు ప్రశ్నలు సంధించారు.
ఏ ఒప్పందం మేరకు భారత్, పాక్ ఈ కలయికకు ఏర్పాటు చేశాయని ఆయన ప్రశ్నించారు. పాక్ కుటిల బుద్ధి తెలిసి కూడా ఆ దేశంతో దౌత్యానికి భారత్ ఎందుకు మొగ్గుచూపిందో, అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారానో, కనీసం ఐక్యరాజ్యసమితి ద్వారానో ముందుకు వెళ్లకుండా..ఇలాంటి మార్గం ఎందుకు ఎంచుకుందో వివరణ ఇవ్వాలని తివారీ డిమాండ్ చేశారు. కులభూషణ్ కుటుంబానికి జరిగిన అవమానాన్ని ఖండించిన ఆయన ఇది దౌత్యపరమైన అపజయంగా అభివర్ణించారు. అటు పాక్ విదేశాంగ కార్యాలయం వెలుపల కులభూషణ్ జాదవ్ తల్లి, భార్యలను పాక్ మీడియా ఎలా వేధించిందో కొన్ని వీడియోలు తెలియజేస్తున్నాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ టెర్రరిస్టుకు తల్లిగా ఎలా ఫీలవుతున్నారు అంటూ ఇబ్బందికర ప్రశ్నలతో పాక్ మీడియా కులభూషణ్ తల్లిని వేధించింది.