నరేంద్రమోదీ సారధ్యంలోని బీజేపీని 2019లో మరోసారి అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్ ఓ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాల మాటలుగా పేర్కొంటూ ఓ జాతీయ చానెల్ ఈ మేరకు ఓ వార్తా కథనాన్ని రూపొందించింది. బీజేపీయేతర పార్టీలను ఏకతాటి మీదకు తీసుకొచ్చి, ఓ పెద్ద కూటమిగా ఏర్పడి 2019 ఎన్నికలను ఎదుర్కోవాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం తమతో చేర్చుకోనున్న పార్టీలకు ఎక్కువ సీట్లను కేటాయించాల్సి వస్తే 250 సీట్లకు అయినా పరిమితం అయి ఎలా అయినా బీజేపీ పతనాన్ని చూడాలనుకుంటోంది అని తెలుస్తోంది.
ఒకవేళ ఇదే జరిగితే స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ స్థానాల్లో పోటీ చేసిన అపఖ్యాతి మూటగట్టుకుంటుంది. 250సీట్ల కంటే తక్కువకే పరిమితం కావాలని పార్టీలో ఓ వర్గం భావిస్తుండగా , గెలిచే అవకాశాలున్న వారినే బరిలోకి దింపాలని మరో వర్గం భావిస్తోందని కధనం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపునకు రోడ్ మ్యాప్ ను ఖరారు చేసేందుకు ఏకే ఆంటోని నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి ఈ బాధ్యతలను పార్టీ అప్పగించిందని. ఈ కమిటీ జిల్లా రాష్ట్ర కమిటీలతో సంప్రదింపులు జరిపి ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను హైకమాండ్ దృష్టికి తీసుకువెళతారని అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పార్టీ వర్గాలు తెలిపాయని సదరు కధనంలో పేర్కొన్నారు. ఆ నివేదికలను అనుసరించి వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగాలనే అంశంపై పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది