హలో ప్రియదర్శణ్‌కి మెగా ఛాన్స్‌

Kalyani Priyadarshan acts in Sai Dharam Tej Movie

ప్రముఖ తమిళ దర్శకుడు ప్రియదర్శణ్‌ కూతురు కళ్యాణి ప్రియదర్శిణి తెలుగు ప్రేక్షకులకు ‘హలో’ చిత్రంతో పరిచయం అయిన విషయం తెల్సిందే. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో అఖిల్‌ హీరోగా నటించాడు. ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆకట్టుకోక పోవడంతో కళ్యాణికి వెంటనే అవకాశం దక్కలేదు. తెలుగులో ఈ అమ్మడికి రెండవ ఛాన్స్‌ దక్కింది. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించబోతున్న చిత్రంలో కళ్యాణిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. గత కొంత కాలంగా సక్సెస్‌ లేక మొహం వాచి ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ చేయబోతున్న సినిమాలో హీరోయిన్‌గా కళ్యాణి ఎంపిక అవ్వడం ప్రస్తుతం కాస్త ఆసక్తికరంగా మారింది.

నేను శైలజ వంటి విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం కథకు తగ్గట్లుగా కళ్యాణి ఉంటుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఆమెను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేని కళ్యాణి, వచ్చిందే ఆఫర్‌ అంటూ వెంటనే ఓకే చెప్పేసింది. హలో చిత్రంలో నటిగా మెప్పించిన కళ్యాణి ఈ చిత్రంలో తన అందంతో ఆకట్టుకోబోతుంది. గతంలో తమిళ హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు స్టార్‌డం తెచ్చి పెట్టిన దర్శకుడు కిషోర్‌ తిరుమల అదే సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని సక్సెస్‌ చేస్తాడు అంటూ కళ్యాణి అండ్‌ కో నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం, వెంటనే ఈ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారు.