హలో… తెలుగు బుల్లెట్ రివ్యూ

Hello Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ , రమ్య కృష్ణ , జగపతిబాబు 
నిర్మాత:   నాగార్జున 
దర్శకత్వం :   విక్రమ్ కె కుమార్ 
సినిమాటోగ్రఫీ:   పి.ఎస్. వినోద్ 
ఎడిటర్ :  ప్రవీణ్ పూడి 
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్ 

“ హలో” సినిమా అఖిల్ రీ లాంచ్ అంటూ నాగార్జున, సినిమా చూస్తుంటే కొన్ని చోట్ల ఏడుపు వచ్చిందని చిరంజీవి లాంటి స్టార్స్ చెప్పడం,మనం లాంటి క్లాసిక్ మూవీ తీసిన విక్రమ్ కుమార్ దర్శకుడు కావడంతో “హలో “ మీద అంచనాలు పెరిగాయి. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “హలో “ ఎలా వుందో చూద్దాం.

కథ…

ఓ అనాధ పిల్లవాడు, పెద్దింటి పిల్ల చిన్నతనంలో అనుకోకుండా కలుస్తారు. ఆ ఇద్దరి మధ్య ఇష్టం ఏర్పడుతుంది. అనుకోకుండా దూరం అయిన ఆ ఇద్దరు చెరో చోటులో వుంటారు. అనాధ పిల్లవాడిని ఓ మంచి దంపతులు దత్తత తీసుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు పెళ్లీడు కి వచ్చాక కలుస్తారు. అయితే ఒకరిని ఇంకొకరు గుర్తు పట్టలేకపోతారు. ఆ ఇద్దరి మధ్య వారధి అయిన ఓ ఫోన్ నెంబర్, ఫోన్ కోసం హీరో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చివరకు ఆ ఇద్దరు కలుస్తారా ? కలవరా అనేది మిగిలిన కధ.

విశ్లేషణ…

”హలో “ టైటిల్ విన్నాక, టీజర్ చూసాక ఇదేదో రెగ్యులర్ సినిమా కాదు అని బలంగా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ పోయి ఓ పాత సినిమా , కొత్త సినిమా కలిపి చూసినట్టు అనిపిస్తుంది. మనసంతా నువ్వే, తూనీగ తూనీగ లాంటి సినిమా కధలు కచ్చితంగా గుర్తుకు వస్తాయి. రోజులతో పాటు మార్పులు వచ్చిన యువత మనోభావాలకు ఇలాంటి కధలు కనెక్ట్ కావడం కష్టమే. అయితే ప్రేమలేఖ తరహాలో పూర్తి క్లాసిక్ మోడల్ లో వెళితే ఎలా ఉండేదో గానీ కమర్షియల్ అంశాలు కూడా జోడించాలని చూడడంతో ఏ వర్గానికి పూర్తిగా కనెక్ట్ కాలేకపోయింది. ఇక హీరో , హీరోయిన్ తమ సోల్ మేట్ ని కలవడానికి తపన పడడం అనే సీన్స్ పర్లేదు అనిపించినా, వారిని నిలువరించే పాయింట్ ఏదీ బలంగా అనిపించదు. దీంతో సినిమాలో డ్రామాకి అవకాశం లేకుండా పోయింది. సరే నాగార్జున వాయిస్ ఓవర్ లో చెప్పినట్టు “మనం “ లో చూపించినట్టు డెస్టినీ ఆధారంగా ప్రేమ కధ నడిచిందని చెప్పేందుకు అలాంటి ఎస్టాబ్లిష్ మెంట్ సీన్స్ అంత కన్నా లేవు. మొత్తానికి అఖిల్ తో రీ లాంచ్ సినిమా బరువు మోస్తూ ఏ తరహా సినిమా తీయాలా అని విక్రమ్ కుమార్ చాలా మధన పడి ఉంటాడు. హలో సినిమాలో కూడా కధనం కూడా ఆ మధనం లాగే అనిపించింది.

ఇక హీరో అఖిల్ గురించి చెప్పుకోవాలంటే అతని కోసం కంపోజ్ చేసిన ఫైట్స్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. అఖిల్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా చేసాడు. అయితే ఓ యాక్షన్ సినిమాలో ఇలాంటి సీక్వెన్స్ ఉంటే బాగుండేది. ఓ ఫీల్ గుడ్ మూవీ లో ఇరికించడానికి చూసినట్టు అయ్యింది పరిస్థితి. ఇక నటన విషయానికి వస్తే కొన్ని సీన్స్ బాగా చేసినా ఎమోషనల్ సీన్స్ మీద ఇంకా కసరత్తు చేయాలి. హీరోయిన్ కళ్యాణి ఓకే. నటన , అందం పరంగా ఆమె ఎక్కడా సూపర్ అనిపించలేకపోయింది. సినిమాలో నటన పరంగా అలా గుర్తు ఉండిపోయేది మాత్రం అఖిల్ తల్లి తండ్రి పాత్ర వేసిన జగపతిబాబు , రమ్యకృష్ణ. వాళ్లిద్దరూ ఈ సినిమాకు ప్లస్ .

మ్యూజిక్ పరంగా అనూప్ రూబెన్స్ బాగా చేసినా మనం మేజిక్ కి ఊహించి వస్తే నిరుత్సాహం తప్పదు. ఇక డైలాగ్స్ విషయంలో కొన్ని చోట్ల మనసుని కదిలిస్తే ఇంకొన్ని చోట్ల నాటకీయత ఎక్కువ అనిపించింది. మొత్తానికి అఖిల్ ని రీ లాంచ్ చేయాలన్న నాగార్జున కోరికను అలాగే మిగిల్చింది “హలో “. విక్రమ్ కుమార్ స్థాయికి తగ్గ సినిమా కాదు ఇది.

తెలుగు బులెట్ పంచ్ లైన్ … ”హలో” అంటే రొటీన్ గా హలో చెప్పారంతే.
తెలుగు బులెట్ రేటింగ్… 2 .5 /5 .