రంగంలోకి దిగిన కాంగ్రెస్…ఏమయ్యేనో ?

కాంగ్రెస్ నుంచి ఎన్నికైన తమను తెరాస పక్షంలో విలీనం చేయాలని నలుగురు ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలిత శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి లేఖ అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెరాస సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ప్రజల పక్షాన నిలబడాలనే ఉద్దేశంతోనే తాము చేరుతున్నామని స్పష్టంచేశారు. కాగా, తెరాస పక్షంలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖకు విలువ లేదని, ఇలా లేఖ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. ఈ మేరకు స్వామిగౌడ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

గతంలో తాము పార్టీ ఫిరాయించిన ప్రభాకర్ రావు, దామోదర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని సీఎల్పీ సమావేశం నిర్వహించే అర్హత ఆకుల లలిత, సంతోష్ కుమార్‌కు లేదని, పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వారితో సమావేశం ఎలా చెల్లుబాటవుతుందని, వారు చేసిన తీర్మానానికి ఎలా విలువ ఉంటుందని అన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న చైర్మన్ రాజ్యాంగాన్ని కాపాడాలని, గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరారు. సరిగా స్పందించకపోతే ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని వెల్లడించారు.