కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి కన్నుమూత…అదే కారణమా ?

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌. జైపాల్‌రెడ్డి(77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో 20వ తేదీ నుంచి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి 1:28 గంటలకి ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. జైపాల్‌ రెడ్డి అకాల మృతి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఎదిగిన జైపాల్‌రెడ్డిని అన్ని పార్టీల నేతలు అభిమానిస్తారు. 1942, జనవరి 16న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాడుగులలో ఆయన జన్మించారు. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా పొందారు. విద్యార్థిగా ఉండగానే ఎన్నో సమస్యలపై పోరాడిన ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. 1980లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీచేసి ఓడిపోయారు. 1985-88 మధ్యకాలంలో జనతాపార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలినేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు.