వై.ఎస్ ఆత్మ కేవీపీ మీద ఇప్పుడు కాంగ్రెస్ కి డౌట్ వచ్చింది. జగన్ కొత్త పార్టీ పెట్టినప్పుడు కూడా కేవీపీ ఆయన వెంట నడవకుండా కాంగ్రెస్ లో కొనసాగడం చాలా మందికి ఆశ్చర్యం కల్పించింది. అలా ఆశ్చర్యపడ్డ వారిలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒకటి. కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ వెంట వెళ్లకుండా ఉండడంతో కేవీపీ మీద కాంగ్రెస్ హైకమాండ్ కూడా నమ్మకం పెంచుకుంది. అయితే ఆ నమ్మకం నిలబెట్టుకోవడంలో మాత్రం కేవీపీ విఫలం అయ్యారనే చెప్పుకోవాలి. కేవీపీ చెప్పినట్టు చేసే pcc అధ్యక్షుడు రఘువీరా సీఎం చంద్రబాబుని టార్గెట్ చేశారు తప్ప ఒక్క రోజు కూడా జగన్ ని వేలెత్తి చూపింది లేదు. పైగా కాంగ్రెస్ ని ఖాళీ చేసిన వైసీపీ లోకే కేవీపీ శిష్యులుగా చెప్పుకునే మల్లాది విష్ణు లాంటి వాళ్ళు చేయడంతో కాస్త ఆలస్యంగా అయినా కాంగ్రెస్ కి కేవీపీ శల్యసారధ్యం గురించి అర్ధం అయ్యింది.
కానీ వైసీపీ ఎప్పుడోసారి తిరిగి తమతో జట్టు కడుతుందన్న ఆశతో ఆ నిజాలు దిగమింగింది కాంగ్రెస్ హైకమాండ్… కానీ బీజేపీ తో అంటకాగుతున్న జగన్ ని చూసాక రాహుల్ గాంధీ ఇక వైసీపీ తో ఎన్నటికీ కలవకూడదని డిసైడ్ అయిపోయారు. అందుకే ఇటీవల ఆంధ్రప్రదేశ్ నాయకులతో సమావేశం అయిన రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జగన్ మీద విమర్శలు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకులు మరీ ముఖ్యంగా కేవీపీ కోటరీ నీళ్లు నమిలింది.
రాహుల్ ప్రశ్నించినంత మాత్రాన కేవీపీ శల్యసారధ్యం ఆపలేదు సరి కదా తన స్పీడ్ కాస్త పెంచినట్టు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. తెలంగాణ లో కెసిఆర్ కి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంట్రాక్ట్స్ చేస్తున్నారని ఇన్నాళ్లు ఆరోపణలు ఎదుర్కొన్న కేవీపీ మీద ఇప్పుడు సరికొత్త వాదనలు తెర మీదకు వచ్చాయి. కుల కోణంలో కెసిఆర్ కి మేలు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని వీక్ చేయడానికి కేవీపీ తన వంతు వ్యూహరచన చేస్తున్నారని టాక్. తాజాగా దానం నాగేందర్ కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టి తెరాస వైపు చూసేందుకు కూడా కేవీపీ కారణం అని తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. మొత్తానికి జగన్ ని స్పేర్ చేయొద్దన్న రాహుల్ మాటకే ఇంత జెర్క్ ఇచ్చిన కేవీపీ వచ్చే ఎన్నికల లోపు వైసీపీ గూటికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.