ఏపీ రాజకీయాల్లో నేడు సంచలనం… కాంగ్రెస్ నేతతో పవన్, బీజేపీ ఎమ్మెల్యేతో J.D. భేటీ.

Pawan Kalyan Meets Nadendla Manohar

ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని నటుడు శివాజీ ఏ ముహూర్తాన చెప్పారో కానీ అంతకు మించిన నాటకీయ ఘట్టాలు కళ్ళ ముందే జరిగిపోతున్నాయి. విభజన సమయంలో కాంగ్రెస్ ని తూర్పారబట్టిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఆ తరువాత కూడా ఆ పార్టీ గురించి ఒక్క సానుకూల వ్యాఖ్య కూడా చేయలేదు. కానీ ఉన్నట్టుండి ఆయన ఈరోజు ఓ కాంగ్రెస్ నాయుడుతో భేటీ కావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ నాయకుడు మరెవరో కాదు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. ఏపీ లో కాంగ్రెస్ ని బలోపేతం చేసే ఉద్దేశంతో ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల మనోహర్ ని పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఆయనకు pcc పగ్గాలు అప్పగించాలని కూడా రాహుల్ ఆలోచిస్తున్నట్టు ఓ టాక్.

ఈ సందర్భంలో నాదెండ్ల మనోహర్ తో పవన్ భేటీ ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనూహ్య వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న పవన్ కాంగ్రెస్ గురించి కూడా సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్టు ఈ భేటీ ద్వారా తెలుస్తోంది. ప్రత్యేక హోదాకి బీజేపీ నిరాకరించడం, ఇక ఆ శక్తి వున్న ఇంకో జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రమే కావడంతో కాంగ్రెస్ తో పొత్తు అంశాన్ని పవన్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే మనోహర్, పవన్ మధ్య భేటీలో ఏమి జరిగిందో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి.

ఇక ఇలాగే ఆశ్చర్యం కలిగించిన ఇంకో భేటీ కూడా నేడే జరిగింది. కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్న సిబిఐ మాజీ జేడీ ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో భేటీ అయ్యారు. ఇటీవలే ఢిల్లీలో బుగ్గనతో ఆకుల సత్యనారాయణ భేటీ ఎంత రచ్చ కి దారి తీసిందో అందరికీ తెలుసు. అసలే బీజేపీ ఆదేశాలకు అనుగుణంగానే ఏపీ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ నేరుగా ఆకుల సత్యనారాయణ తో భేటీకి పూనుకోవడం ఆశ్చర్యమే. అయితే పాత స్నేహితుడు అయినందునే ఆకులతో సమావేశం అయినట్టు జేడీ లక్ష్మీనారాయణ చెబుతున్న మాటల్లో నిజం వున్నా, లేకున్నా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జనం ఈ తరహా సమావేశాల్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి మాత్రం లేదు.