ఏపీ ఎంపీల ఆందోళ‌నల‌తో మారుతున్న‌రాజ‌కీయం

Congress Support to TDP and YSRCP MP's Protest

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఢిల్లీ ద‌ద్ద‌రిల్లింది. విభ‌జ‌న హామీల అమ‌లుకోసం టీడీపీ ఎంపీలు చేసిన ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తిపోయింది. టీడీపీ ఎంపీల ఆందోళ‌న‌కు, మిగిలిన పార్టీల ఎంపీల నిర‌స‌న కూడా తోడ‌వ‌డంతో పార్ల‌మెంట్ బ‌య‌టా… లోప‌లా… ఆంధ్ర‌ప్ర‌దేశ్ హాట్ టాపిక్ అయింది. విభ‌జ‌న బాధిత ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంతో పాటు పెండింగ్ లో ఉన్న విభ‌జ‌న హామీలు వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ వ‌రుస‌గా రెండోరోజూ ఆంధ్రాఎంపీలు పార్ల‌మెంట్ ను స్తంభింప‌జేశారు. ఉభ‌య‌స‌భ‌లు ప్రారంభంకాగానే ఎంపీలు ఆందోళ‌నకు దిగారు. దీంతో లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌లు పలుమార్లు వాయిదాప‌డ్డాయి. విభ‌జ‌న స‌మ‌స్యల‌పై టీడీపీ ఎంపీల ఆందోళ‌న‌తో పాటు, రిజ‌ర్వేష‌న్ల కోటా పెంపు అంశంపై టీఆర్ ఎస్ స‌భ్యులు నినాదాలు చేయ‌డంతో లోక్ స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. తెలుగు ఎంపీల నినాదాల‌తో స‌భానిర్వ‌హ‌ణ క‌ష్ట‌మ‌వ‌డంతో స్పీక‌ర్ సుమిత్రామ‌హాజ‌న్ రేప‌టికి వాయిదావేశారు. పార్ల‌మెంట్ బ‌య‌టా వాడీవేడీ వాతావ‌ర‌ణం కొన‌సాగింది.

స‌మావేశాలు ప్రారంభానికి ముందు, వాయిదా ప‌డిన త‌ర్వాతా… టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. ప్ల‌కార్డులు చేత‌బ‌ట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు న్యాయం చేయాల‌ని నినాదాలు చేశారు. గ‌ల్లా జ‌య‌దేవ్, తోట న‌ర‌సింహం, శివ‌ప్ర‌సాద్, ముర‌ళీమోహ‌న్, నిమ్మ‌ల‌కిష్ట‌ప్ప‌, రామ్మోహ‌న్ నాయుడు, మాగంటి బాబుతో పాటు మ‌రికొంద‌రు ఎంపీలు ఆందోళ‌నలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. గాంధీవిగ్ర‌హం వ‌ద్ద ఆందోళ‌న‌చేస్తున్న టీడీపీ ఎంపీల‌తో కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ రామ‌చంద్రారావు, రేణుకాచౌద‌రి జ‌త క‌లిశారు. ఇది తెలుగువారి ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన స‌మ‌స్య‌ని, విభ‌జ‌న హామీలు నిర్ల‌క్ష్యం చేస్తే కేంద్రానికి బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించారు. రాజ‌కీయాంగా ఎలాంటి విభేదాలున్నా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో మాత్రం క‌లిసి పోరాడ‌తామ‌ని రేణుకాచౌద‌రి వ్యాఖ్యానించారు. ఏపీ స‌మ‌స్య‌ల‌పై తాను టీడీపీ కంటే ముందునుంచే పోరాడుతున్నాన‌ని కేవీపీ అన్నారు. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ‌దీక్ష పేరుతో ఏపీ ఎంపీలు నిర్వ‌హిస్తున్న‌ ఆందోళ‌నలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సైతం పాల్గొన్నారు. త‌మ‌పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డుతుంద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని రాహుల్ అన్నారు. 2019లో తాము అధికారంలోకి రాగానే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీఇచ్చారు. మొత్తానికి విభ‌జ‌న హామీల అమ‌లుకోసం టీడీపీ ఎంపీలుచేస్తున్న పోరాటం కొత్త రాజ‌కీయ‌స‌మీక‌ర‌ణాల దిశ‌గా సాగుతోంది.