మహాకూటమిలోని పార్టీలు కాంగ్రెస్, టీడీపీ ఇప్పటికే రెండు విడుతలుగా అభ్యర్థులను ప్రకటించాయి. నేడు మూడు విడుత కూడా అభ్యర్థులను ప్రకటించవచ్చు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రకటించిన కొన్ని స్థానాల్లో ఇరు పార్టీలకు అసంతృప్తి సెగ తగులుతుంది. ఆశావహులు టిక్కెట్లు ప్రకటించిన స్థానాల్లో కూడా ఇంకా ఆశ పోగొట్టుకోవట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఒక స్థానం విషయంలో పట్టుబడుతున్నారు. అదే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన జాబితాలో వరంగల్ పశ్చిమ కూడా ఉంది. ఈ స్థానం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు ప్రకటించారు.ఈ సీటు కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆశించారు. అంతేకాదు ఆయనికి పశ్చిమ టిక్కెట్ కేటాయించాలని హన్మకొండ డీసీసీ భవన్‌లో స్థానిక నేతలు ఆమరణ దీక్ష కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటుని టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డికి కేటాయించారు.
అయినా కాంగ్రెస్ నేతలు పట్టువీడకుండా రాజేందర్‌రెడ్డికే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు దీక్షలో పాల్గొన్న నేతలను సంప్రదించారు. దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ తో పాటు మిగతా నాయకులతో చర్చించారు. న్యాయం చేయాలని నాయకులు,కార్యకర్తలు వి.హెచ్ ను చుట్టుముట్టారు. రాజేందర్‌రెడ్డికి టిక్కెట్, బీ-ఫాం కేటాయింపు తర్వాతే దీక్ష విరమిస్తామని కట్ల శ్రీనివాస్ సమాధానమిచ్చారు. వి.హెచ్ నచ్చచెప్పే యత్నంచేసినా స్వీయ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న నేతలు డీసీసీ భవన్ నుంచి బయటకు రాలేదు. వి.హెచ్ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా నేతలు వినలేదు. రాజేందర్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. తాజాగా నేడు ఇప్పుడు ఏకంగా పశ్చిమ నుంచి కాంగ్రెస్ తరుపున నామినేషన్ వేసి టీడీపీకి పెద్ద షాకే ఇచ్చారు. హన్మకొండలోని ఆర్‌డీవో కార్యాలయంలో బుధవారం రాజేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే నామినేషన్ వేసినట్లు స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ టిక్కెట్ న్యాయంగా తనకే దక్కాల్సి ఉందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌అలీ వంటి ముఖ్య నేతలు పశ్చిమ నియోజకవర్గ పార్టీ సభలు, సమావేశాలలోనే ప్రకటించారని రాజేందర్‌రెడ్డి చెప్పారు. పశ్చిమ కాంగ్రెస్ శ్రేణుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుండడంతో టిక్కెట్ విషయంపై అధిష్ఠానం పునరాలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధినేతలు తనతో ఫోన్‌లో కూడా సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. తనకు న్యాయం జరుగుతుందన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి పెద్ద మనస్సుతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా, వివిధ పార్టీ పదవులతో రాజకీయ అనుభవం గడించిన ప్రకాష్ రెడ్డి పశ్చిమ టిక్కెట్ తనకు ఇవ్వాలని రాజేందర్‌రెడ్డి కోరారు. తెలుగుదేశం ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే రాజేందర్‌రెడ్డి ట్విస్ట్ ఇస్తూ కాంగ్రెస్ తరుపున నామినేషన్ వేశారు. మరి కాంగ్రెస్ ఈ టిక్కెట్ విషయంలో రాజేందర్‌రెడ్డిని బుజ్జగిస్తుందో లేక టీడీపీకి షాక్ ఇస్తుందో చూడాలి.