Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు మోడీ సర్కార్ తీపికబురు పంపింది. ఏ ఆశ చూపి చంద్రబాబు, కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కి తెర లేపారో ఆ కోరిక తీర్చబోతున్నట్టు కేంద్రం నుంచి సంకేతం వచ్చేసింది. శాసనసభ స్థానాలు పెరుగుతాయనే నమ్మకంతో వున్న పార్టీని వీడి అధికార పార్టీ పంచన చేరిన ఎందరో నాయకులు ఇక వచ్చే ఎన్నికల్లో తమకు నియోజకవర్గం మిగులుతుందో లేదో అనే టెన్షన్ పడక్కర్లేదు. విభజన చట్టంలో పేర్కొన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని ఇప్పటిదాకా చెప్తూ వచ్చిన కేంద్రం తాజాగా మనసు మార్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
కేంద్రం తీసుకున్న ఓ చర్యతో తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు కసరత్తు మొదలైనట్టే వుంది. పార్లమెంట్ వేదికగా ఎన్నో సందర్భాల్లో సీట్ల పెంపు అసాధ్యమని చెప్పిన కేంద్రం ఇప్పుడు మనసు మార్చుకోడానికి అటు చంద్రబాబు, ఇటు కెసిఆర్ తెచ్చిన ఒత్తిడి ఫలితమే అని వేరే చెప్పక్కర్లేదు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సైతం తన వంతు పాత్ర పోషించడంతో సీట్ల పెంపుకు మార్గం సుగమం అయ్యింది. ముఖ్యంగా ఏపీ లో టీడీపీ తో కలిసే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకున్నాక శాసనసభ స్థానాల పెంపు మీద కేంద్రం ముందడుగు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం మీద బీజేపీ ద్వయం మోడీ, అమిత్ షా కూడా ప్రత్యేకంగా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నియోజకవర్గాల సాంఖ్య పెంచాలంటే పార్లమెంట్ లో దానికి అనువుగా బిల్లు ఆమోదం పొందాల్సిందే. ఆ బిల్లుకు అవసరమైన అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ కోసం కేంద్రం తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యాయశాఖ లకి సమాచారం పంపింది. అంటే పార్లమెంట్ లో బిల్లు కోసం కసరత్తు మొదలైనట్టే. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వున్న 175 స్థానాలు 225 గా మారతాయి. ఇక తెలంగాణాలో ఇప్పుడున్న 119 స్థానాలు 153 కి పెరుగుతాయి.