దివంగత కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావు చనిపోయి ఏడాది కూడా కాక ముందే వారింట ఆస్తి తగాదాలు రోడ్డుకేక్కాయి. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ పెద్ద కోడలు దాసరి సుశీల సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం.46లోని దాసరి నివాసం ఎదుట బైఠాయించారు. దాసరి నారాయణరావు పెద్దకుమారుడు ప్రభుతో 1995లో ప్రేమ వివాహం జరిగిందని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా చేసుకున్నామని వెల్లడించింది. అప్పటి నుండి తమను పంజాగుట్టలోని ఇంటిలో దాసరి ఉంచారని ఇప్పుడు ఆయన చనిపోయాక ఆ ఇంటిని కూడా తన చేత ఆయన చిన్న కుమారుడు, కోడలు ఖాళీ చేయించారని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే సుశీలకు పలు మహిళా సంఘాలు బాసటగా నిలిచాయి. దాసరి నారాయణరావు ఉన్నంతకాలం తమ కుటుంబానికి అండగా నిలిచారని, ఆయన మరణానంతరం కొడుకు తమను విస్మరించడంతోపాటు కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించకపోవడంతో రోడ్డున పడ్డామని ఆరోపించారు.
ఇప్పటికీ చట్టపరంగా దాసరి ప్రభుతో విడాకులు ఇవ్వలేదని, మామ ఆస్తిపై హక్కు ఉందని ఆమె పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు ఇంటి నుంచి వెళ్లనని భీష్మించుకుని కూర్చుకున్నారు.అయితే దాసరి కన్నుమూసిన సమయంలోనూ సుశీల సంచలన ఆరోపణలు చేశారు. దాసరి మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని, రెండు రోజుల కిందట ఆయణ్ని చూడటానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు తనను అడ్డుకున్నారని ఆమె చెప్పారు. దాసరి అస్తమించిన కొద్దిసేపటికే మీడియా ముందుకు వచ్చిన సుశీల తాను దాసరి పెద్దకోడలినని, తనకు తారక ప్రభుకు ఓ కొడుకు ఉన్నాడని అతడి పేరు కూడా దాసరి నారాయణ రావే అని చెప్పారు. అనంతరం ఆస్తి వివాదాలను ప్రస్తావించారు.
అయితే ఆసమయంలో సినీ పెద్దలు మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అందుకే ఆమె అప్పుడు సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. కానీ తాజాగా మోహన్ బాబుకు ఫోన్ చేసి తన సమస్య గురించి మరోసారి గుర్తు చేయగా తనకు ఆ విషయంతో ఎలాంటి సంబంధంలేదని చెప్పినట్లు అందుకే ఆమె ఇప్పుడు రంగంలోకి దిగినట్టు సమాచారం అందుతోంది. తన కుమారుణ్ని హీరోగా చేస్తానని, ఆస్తిలో భాగం ఇస్తానని దాసరి తనకు హామీ ఇచ్చారని సుశీల తెలిపారు.
తన భర్తతోనే తాను కలిసి ఉంటానని, కానీ ఆయనకు ఉన్నవీ లేనివి చెప్పి ఎక్కడికో తీసుకెళ్లారని ఆమె ఆరోపిస్తున్నారు. సినీ రంగంలో చిన్న గిదవ జరగినా తన సమస్యగా భావించి దానీని పరిష్కరించిన దాసరి, తన కుటుంబ సమస్యల వలన ఇప్పుడు వార్తల్లోకి రావడం కాస్త బాధ కలిగించే విషయమే.