దాసరి స్థానం భర్తీ చేస్తున్న పవన్‌!!!

Pawan Kalyan To Attend for Sakshyam movie Audio Launch

Posted May 16, 2018 (1 week ago) at 15:45

తెలుగు సినిమా పరిశ్రమకు దాసరి నారాయణ రావు పెద్ద దిక్కుగా కొనసాగుతూ వచ్చారు. ఆయన ఏ చిన్న కార్యక్రమంకు పిలిచినా హాజరు అయ్యి, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉండే వారు. దాసరి నారాయణ రావు దాదాపు వెయ్యికి పైగా సినిమా కార్యక్రమాలకు హాజరు అయ్యి ఉండవచ్చు. పెద్ద, చిన్న హీరో, కొత్త, పాత హీరో అనే తేడా లేకుండా ఏ నిర్మాత పిలిచినా కూడా తన వంతుగా ఆ సినిమాకు సాయంగా నిలిచేవాడు. దాసరి రాకతో ఆ సినిమాకు పబ్లిసిటీ దక్కేది. ఆయన మరణం తర్వాత ఆయన లోటు అలాగే మిగిలి పోయింది. ఆయన లేని లోటును టాలీవుడ్‌కు ఎవరు భర్తీ చేయలేరు అనే విషయం వాస్తవం. అయితే అంతో ఇంతో పవన్‌ భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నాడు.

సినిమాల్లో ఉన్న సమయంలో ఇతర హీరోల సినీ వేడుకలకు పెద్దగా హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించని పవన్‌ ప్రస్తుతం వరుసగా సినీ వేడుకల్లో పాల్గొంటున్నాడు. ఇటీవలే రంగస్థలం, నా పేరు సూర్య థ్యాంక్స్‌ మీట్‌లో పాల్గొన్న పవన్‌, నేల టికెట్‌ ఆడియోను తన చేతుల మీదుగా ఆవిష్కరించాడు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సాక్ష్యం’ అనే చిత్రం ఆడియోను కూడా పవన్‌ ఆవిష్కరించేందుకు ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించాడు. దేవిశ్రీ రిక్వెస్ట్‌ మేరకు ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్‌ పాల్గొనబోతున్నాడు అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి పవన్‌ వరుసగా సినీ వేడుకల్లో పాల్గొనడం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

SHARE