‘మా’ లో వివాదం…భగ్గుమన్న విభేదాలు !

Controversy in maa association

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమెరికాలో ‘మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేసినట్టు వార్తలు రావడంతో టాలీవుడ్ లో దుమారం మొదలైంది. గడచిన మూడు రోజులుగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ లో పంచాయతీలు జరుగుతూ ఉండగా ‘మా’ కార్యదర్శి నరేష్, ఆఫీసుకు తాళం వేయడంతో పరిస్థితి మరింతగా ముదిరింది. ఆపై అత్యవసర సమావేశం జరిపి, శివాజీ రాజా వివరణ తీసుకున్న తరువాత, వివాదం సద్దుమణిగిందన్న ప్రకటన వెలువడినా వివాదం మాత్రం సద్దుమణగలేదు. దీనిపై నేటి ఉదయం ‘మా’ కార్యవర్గం మరోసారి సమావేశమై చర్చించింది. సమావేశం అనంతరం శివాజీ రాజా, శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ‘మా’ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.

srikanth

అసోసియేషన్‌లో 5 పైసలు దుర్వినియోగమైనా తన ఆస్తినంతా రాసిచ్చేస్తానని శివాజీ రాజా సవాల్‌ చేశారు. తాను అసోసియేషన్ డబ్బుతో సింగిల్ టీ కూడా తాగాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆరోపణల పై విచారణ కమిటీ వేయడానికి ప్రతిపాదించగా మరో వర్గం వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సిల్వర్ జూబ్లీ వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో ‘మా’ అసోసియేషన్‌ నిర్మించాలన్నదే తమ ఉద్దేశమని, అసోసియేషన్‌ ఎన్నికలు సమీపిస్తుండటంతో కొంత మంది కావాలనే తమపై నిందలు వేస్తూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైందని చెప్పారు. నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని శివాజీ రాజా, శ్రీకాంత్ అన్నారు.

srikanth