దేశంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా.. తీవ్రత కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతోన్న కేసుల్లో 50 శాతం కేరళ, పశ్చిమ్ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, యాక్టివ్ కేసుల్లోనూ 18 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మొత్తం 6.5 లక్షల యాక్టివ్ కేసుల్లో 35 శాతం 18 జిల్లాల్లోనే ఉన్నట్టు కేంద్రం తెలిపింది. సెప్టెంబరు 23-29 వారానికి 83,232గా ఉన్న రోజువారీ సగటు కేసులు అక్టోబరు 21-27 వారానికి 49,909కి పడిపోయాయి. ప్రస్తుతం రోజూ 11 లక్షలకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
సోమవారం దేశవ్యాప్తంగా 36,470 కేసులు నమోదుకాగా.. జులై 17 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే, దసరా నేపథ్యంలో టెస్టింగ్ సంఖ్య తగ్గడంతోనే కేసులు తక్కువగా నమోదయ్యాయి. అంతకు ముందు మూడు రోజులతో పోల్చితే కేరళ, మహారాష్ట్ర సహ ఢిల్లీలోనూ సోమవారం కేసులు తక్కువ మొత్తంలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివీటి రేటు 8.06 శాతంగా ఉంది.