జిల్లాలో మరో 13 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 566 కు చేరింది. ఇందులో ఇప్పటి వరకు 267 మంది డిశ్చార్జ్ కావడం, 16 మంది మృతి చెందడంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 283 (కరోనాతో బాధపడుతున్న వారు) మాత్రమే ఉంది. తాజాగా నమోదైన 13 కేసుల్లో కర్నూలు నగరంలో 11, నంద్యాల, ఆదోనిలో ఒక్కొక్కటి ఉన్నాయి. దీంతో పాటు కర్నూలులో మరొకరు మృతి చెందారు. ఇప్పటి వరకు జిల్లాలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కర్నూలు నగరంలో 357 మందికి, నంద్యాలలో 112 మందికి కరోనా సోకినట్లయ్యింది.
జిల్లాలో కరోనాను జయించిన 28 మందిని ఆదివారం సాయంత్రం అధికారులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వీరిలో నంద్యాల సమీపంలోని శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి ఆరుగురు, కర్నూలు సమీపంలోని విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి 19 మంది, కర్నూలు చైతన్య కాలేజీ ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుంచి ముగ్గురిని డిశ్చార్జ్ చేశారు. జిల్లాలో నాలుగు రోజుల నుంచి కొత్త కేసుల కంటే ఎక్కువగా డిశ్చార్జ్‌లు అవుతున్నాయి. ఇప్పటి వరకు 267 మంది కరోనా విజేతలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు.
ఆదివారం విడుదల అయిన వారిలో 23 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఇందులో కర్నూలు నగర వాసులు 20, ఆత్మకూరు వాసి ఒకరు, నంద్యాల వాసులు ఆరుగురు, కోడుమూరుకు చెందిన ఒకరు ఉన్నారు. వీరిలో 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఇద్దరు, 40 నుంచి 60 ఏళ్ల మధ్యలో 12 మంది, 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో 14 మంది కరోనాను జయించారు. వీరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి రూ.2 వేల నగదు అందించి ప్రత్యేక అంబులెన్స్‌లో ఇంటికి పంపించారు.