ఎక్స్ రే ద్వారా కరోనా గుర్తించే సాఫ్ట్ వేర్

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా అల్లల్లాడిపోతుంది. కోవిడ్ 19 మహమ్మారితో జనం అతలాకుతలమవుతున్నారు. ఈ సమయంలో ఐఐటి-రూర్కీ ప్రొఫెసర్ కీలక విషయాలను తెలిపారు. అదేమంటే.. కేవలం అయిదు సెకన్లలో కరోనా వైరస్ వ్యాధిని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను తాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. వైరస్ సోకిందన్న అనుమానం ఉన్న వ్యక్తి ఎక్స్-రే ఉపయోగించి ఐదు సెకన్లలోను వైరస్ ఉనికిని గుర్తించవచ్చని తెలిపారు. ఈ సాఫ్ట్ వేర్‌ను ఉపయోగించి, వైద్యులు ఒక వ్యక్తి ఎక్స్‌రే చిత్రాల ద్వారా సాఫ్ట్‌వేర్ రోగికి న్యుమోనియా లక్షణాలు ఉన్నాయా లేదా అని వర్గీకరించడమే కాకుండా.. అది కరోనాకు సంబంధించిందా లేక ఇతర బ్యాక్టీరియానా అనేది కూడా తెలుసుకోవచ్చని కూడా తెలిపారు. ఆ వెంటనే ఈ వ్యాధి విస్తరణను అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు.

కాగా ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ అన్నారు. కరోనా, న్యుమోనియా, క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్‌లను విశ్లేషించిన తర్వాత మొదట ఒక కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్టు వివరించారు. అంతేకాకుండా అమెరికాకు చెందిన ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ ఛాతీఎక్స్-రే డేటాబేస్ ను కూడా విశ్లేషించానని చెప్పారు. ఈ సాఫ్ట్‌వేర్ పరీక్ష ఖర్చులను తగ్గించడమే కాకుండా వైద్యులు ఆ ప్రమాద బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అయితే జైన్ చెప్పిన ఈ విషయంపై ఆ వైద్య సంస్థ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కాగా ఇప్పటివరకు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలకు పైగా నమోదైంది. మరణాల సంఖ్య 718కి పెరిగింది