తమిళనాడులో ఆ మూడు రోజులు చాలా కఠినం…

కరోనా చాలా తీవ్రంగా విజృంభిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఏకంగా ఐదు నగరాల్లో మూడు రోజులపాటు లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఈ తరుణంలో చెన్నై, మధురై, కోయంబత్తూర్‌, తిరుపూర్‌, సేలమ్‌లలో ఏప్రిల్‌ 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తామని తెలిపింది.

ఈ మూడు రోజులు ఎలాంటి మినహాయింపులు ఉండవని.. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి కె. పళనిస్వామి స్పష్టం చేశారు.కాగా ఆదివారం (ఏప్రిల్‌ 26) ఉదయం 6గంటల నుంచి బుధవారం (ఏప్రిల్‌ 28) రాత్రి 9 గంటల వరకు చెన్నై, మధురై, కోయంబత్తూర్‌లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, తిరుపూర్‌, సేలంలలో ఆదివారం నుంచి మంగళవారం వరకు రెండురోజులపాటు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. అయితే తమిళనాడులో ఇప్పటివరకు 1,600 కరోనా కేసులు నమోదుకాగా.. 20 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క చెన్నై నగరంలోనే 400 కేసులు నమోదుకాగా.. కోయంబత్తూర్‌లో 134, తిరుపూర్‌లో 110 కరోనా కేసులు నమోదు అయ్యాయి.