మంగళవారం హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసు బయటపడిందని తెలిసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాలు.. సినిమాలు.. క్రికెట్ అన్నింటినీ కరోనా డామినేట్ చేసింది. ప్రతి సోషల్ మీడియాలోనూ… ప్రత్యక్షంగా కూడా ఎవరు కలిసినా కరోనా గురించే చర్చ. వారి భయాన్ని బుధవారం ఘటనలు మరింతగా భయపెట్టాయి. రహేజా ఐటీ పార్క్లో ఓ ఉద్యోగికి కరోనా బయటపడటంతో క్షణాల్లో ఆఫీసులన్నీ ఖాళీ అయిపోయాయి.
కరోనా అనుమానితులంటూ.. విజయవాడ, ఏలూరుల్లోనూ.. కొంత మందిని ఐసోలేషన్ రూముల్లో పెట్టారు. కరోనా గురించి భయపడవద్దని ప్రభుత్వం నింపాదిగా చెబుతుంది కానీ… అసలు వచ్చేసిన తర్వాత కూడా.. సరైన రక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. పొరుగున ఉన్న చైనాలో బయటపడిన తర్వాత ఇండియాలో వ్యాప్తి కాకుండా కరోనా వ్యాప్తిపై దేశ స్థాయిలో… తీసుకున్న రక్షణ చర్యలు అంతంతమాత్రమే. తెలుగు రాష్ట్రాలు అయితే అసలు దృష్టి కూడా పెట్టలేదు.
ఇప్పుడు హడావుడిగా ఐసోలేషన్ రూములని.. మెడిసిన్స్ అని హడావుడి చేస్తన్నారు కానీ.. ఇప్పటికే.. కరోనా.. తెలుగు రాష్ట్రాలపై దాడి ప్రారంభించేసింది. కొద్ది రోజుల క్రితం .. ఇండియాలో కరోనా విజృంభిస్తే తీసుకోవాల్సిన చర్యలపై సన్నద్ధత లేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అలా అన్న కొద్ది రోజులకే.. వైరస్ ఇండియాలో విజృంభిస్తోంది.