ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. తాజాగా ఢిల్లీలో, హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు దీని గురుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి.
అయితే తాజాగా నేడు హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్ బిల్డింగ్ నంబర్ 20లో ఉన్న డీఎస్‌ఎం కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఐటీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తెలుగు ప్రజలలో మరింత భయం మొదలయ్యింది. అయితే తాజాగా ఏపీలో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. విశాఖలోని చెస్ట్ ఆసుపత్రిలో అయిదు కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. అయితే ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఐసోలేషన్ వార్డులో చికిత్స కొనసాగుతోంది.
ఇటీవల మలేషియా, కౌలాలంపూర్ నుంచి వచ్చిన ముగ్గురు కుటీంబీకులు తల్లి, తండ్రి, కుమార్తె కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. మరోవైపు గాజువాక ప్రాంతానికి చెందిన యువతి ఇటీవల బహ్రెయిన్‌లో ఉంటున్న తల్లిదండ్రులు వద్దకు వెళ్ళి వచ్చింది. తాజాగా ఆ యువతికి, ఆమె స్నేహితుడికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచిన వైద్యులు వారి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి, పూణేకి పంపారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా తెలుగు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.