భారత్‌లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజు మూడు లక్షలకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,15,993 పరీక్షలు నిర్వహించగా 2,34,281 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఓ వైపు కొత్త కేసులు తగ్గినా.. మరణాలు మాత్రం పెరిగాయి. నిన్న 893 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,94,091కు పెరిగాయి. అయితే కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఒక్కరోజే 3,52,784 మంది కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు.
ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం యాక్టివ్ 18,84,937 కేసులు ఉన్నాయి. మొత్తం రికవరీల సంఖ్య 3,87,13,494కి పెరగగా.. రికవరీ రేటు 94.21శాతంగా ఉంది. రోజువారీ పాటిటివిటీ రేటు13.39 శాతం నుంచి 14.50 శాతానికి పెరిగింది. వారం వారీ పాజిటివ్ రేటు16.0 శాతానికి పెరిగింది. మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 165.70 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేశారు. అలాగే మొత్తం 72.73 కోట్ల పరీక్షలు నిర్వహించారు.