ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి మంగళవారం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. ఈ ఘటన ముంబైలో స్థానికంగా కలకలం రేపడంతో దర్యాప్తు చేయాల్సిందిగా మేయర్ కిషోర్ ఫడ్నేకర్ అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలతో 80 ఏళ్ల విఠల్ ములేని జూన్ 6న శతాబ్ది ఆసుపత్రిలో చేర్పించగా కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించగా మిగతా కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు.
అయితే రెండు రోజుల్లోనే హాస్పిటల్ నుంచి తప్పించుకున్న విఠల్ ములే బోరివాలి స్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్‌పై శవమై కనిపించాడు. ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా విఠల్ మనువడు ప్రవీణ్ రౌత్ స్థానిక బిజెపి కార్పొరేటర్ వినోద్ మిశ్రాకి ఫిర్యాదు చేశారు. కట్టుదిట్టమైన భద్రత, నిత్యం వైద్యుల పర్యవేక్షణ ఉన్నా రోగి తప్పించుకొని పోవడం ఏంటని వినోద్ మిశ్రా ప్రశ్నించారు. దీనికి సంబంధించి దర్యాప్తు జరిపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘ప్రముఖ ఆసుపత్రి ఉండి కూడా సీసీటీవీ పనిచేయడం లేదు. దాదాపు 12 గంటల తర్వాత తాతయ్య తప్పిపోయినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారు’ అంటూ రౌత్ ఆస్పత్రి వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.