కరోనా సైతం ఆపలేని టిక్ టాక్ : శాడ్ సాంగ్ టిక్ టాక్ తో కరోనా పేషెంట్

టిక్ టాక్ గా టిక్ టాక్ లు చేసి జనాలని మెప్పించే మహిళ  కరోనా సోకినా గానీ.. టిక్ టాక్ లను వదలలేదు. అంతపిచ్చి ఆమెకు టిక్‌టాక్ వీడియోలంటే. పాపులర్ పాటలకు టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో దండిగా ఫాలోవర్స్‌ను పెంచేసుకుంది. తాజాగా ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఐసోలేషన్ వార్డులోనూ ఆమె టిక్ టాక్‌ను వదల్లేదు.

శానిటైజేషన్ సిబ్బందితో కలిసి టిక్ టాక్ వీడియో చేసింది. ఈసారి ఓ శాడ్ సాంగ్ అందుకుంది. గంటల్లోనే కరోనా వైరస్‌లా ఆ వీడియో వైరల్ అయిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 25ఏళ్ల ఆ మహిళతో కలిసి టిక్ టాక్ వీడియో చేసిన శానిటైజేషన్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తమిళనాడులోని అరియలూర్ జిల్లాకు చెందిన ఓ యువతి చెన్నైలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. ఖాళీ దొరికినప్పుడల్లా టిక్‌టాక్‌లతో ఊపుతూ జనాలను హుషారక్కిస్తుంటుంది. తాజాగా ఆమె జ్వరం, దగ్గు లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. పరీక్షించగా మార్చి 26వతేదీన కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆమెను అరియలూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐసోలేషన్ వార్డులో ఉన్న బాధిత మహిళ మార్చి 28న టిక్‌టాక్ వీడియో చేసి.. ఆమెతో పాటు సిబ్బందిని కూడా అలా బుక్ చేసిందన్నమాట.