ఉత్తరప్రదేశ్‌లో కరోనా రోగులు అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘాజీపూర్‌కు చెందిన 42 మంది కరోనా బారిన పడ్డ వ్యక్తులు కనిపించకుండా పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ ఇచ్చిన ల్యాబ్‌లో కూడా వారంతా తప్పుడు అడ్రస్, ఫోన్‌నెంబర్లు ఇచ్చినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. దీనిపై ఘాజీపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేకే వర్మ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఈ కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయిన దాదాపు 42 మంది కనిపించడం లేదని పేర్కొన్నారు. వారంతా ఆసుపత్రిలో కానీ హోం ఐసొలేషన్‌లో కూడా లేరని లేఖలో వెల్లడించారు.
పరీక్షా సమయంలో వారంత తప్పుడు సమాచారం, నకిలీ మొబైల్ నెంబర్ ఇచ్చారని తెలిపారు. కనిపించకుండా పోయిన కరోనా రోగులను పట్టుకునేందుకు కష్టతరంగా ఉందని, ఇందుకోసం బృందాలను ఏర్పాటు చేసి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని డాక్టర్ వర్మ లేఖలో వివరించారు. ఇప్పటి వరకు ఘాజీపూర్‌లో 505 యాక్టివ్ కేసుల నమోదు కాగా.. 10 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య 16 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,079 కేసులు నమోదయ్యాయి. గురువారం 779 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో మరణించారు.