శుక్రవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైన విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనట్లుగా ఒక్కరోజులో తెలంగాణలో 169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 82 కేసులు నమోదు కావటం గమనార్హం. ఒకే రోజులో అత్యధిక కేసుల నమోదులో ఈ రెండు రికార్డులేనని చెబుతున్నారు. మొన్నటివరకూ తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పాజిటివ్ కేసులే నమోదు కానీ తీరుకు భిన్నంగా ఇప్పుడు ఒకటి అరా కేసులు వస్తుండటం గమనార్హం.
శుక్రవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండగా.. సౌదీ నుంచి వచ్చిన 64 మందికి కూడా పాజిటివ్ రావటం కొత్త తలనొప్పిగా మారింది. సరైన వీసాలు లేకుండా సౌదీలో దొరికిపోయిన పలువురిని ఆ దేశం వెనక్కి పంపేసింది. ఇలా పంపిన వారిలో ఎక్కువమంది పాజిటివ్ కేసులు కావటం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.
అంతేకాదు.. ఇతరరాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులతోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కేసులు రాగా.. రంగారెడ్డిలో 14 కేసులు.. మెదక్ లో రెండు.. సంగారెడ్డి జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి.
గడిచిన మూడు రోజుల్నే తీసుకుంటే కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. మే 27నుంచి వరుస పెట్టి నమోదవుతున్న పాజిటివ్ కేసులు వందకు తగ్గకపోవటం ఒక విశేషంగా చెప్పాలి. అంతేకాదు.. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. గతంలో ఒకటి అరా అన్నట్లు ఉండే మరణాలు.. ఇటీవల కాలంలో ప్రతి రోజు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.