కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో చైనాలో మొదలైన కరోనా వైరస్ ఖండాంతరాలను దాటి విజృంభిస్తోంది. కరోనాతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య లక్షల్లో ఉంది. ఈ సంద్భంగా ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ తనకు ఆరు నెలల ముందే కరోనా సోకిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం గుడ్ మార్నింగ్ బ్రిటన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో బోథమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘ఆరు నెలలు ముందే.. అంటే జనవరి మొదట్లోనో లేక డిసెంబర్ చివరిలోనో సరిగ్గా గుర్తులేదు కానీ.. నాకు కరోనా వైరస్ సోకింది. అయితే అప్పట్లో దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడంతో బ్యాడ్ ఫ్లూ అని తప్పుగా అర్థం చేసుకున్నా. అసలు అవి కరోనా లక్షణాలని నాకు అప్పట్లో తెలియదు. సాధారణంగా ఫ్లూ జ్వరం వచ్చినా కూడా లక్షణాలు ఇలాగే ఉంటాయిలే అనుకొని తప్పుగా అర్థం చేసుకొన్నా. దీని గురించి పెద్దగా తెలియకపోవడంతో చాలా రోజులు బాధపడ్డా. కానీ తర్వాత తగ్గిపోయింది. చూద్దాం కరోనా ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో. జనాలు మరికొన్ని రోజులు ఓపికపడితే రాబోయే రెండు వారాల్లో పరిస్థితి మెరుగుపడుతుంది.
ఇప్పటికే కరోనా నుంచి తప్పించుకోవడానికి ప్రజలంతా తమ వంతుగా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగించాలని నేను కోరుతున్నా. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్యా క్రీడలు జరగకపోవడమే మంచిది. మరికొద్ది రోజులు ఓపికపడితే త్వరలోనే క్రీడలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఆటగాళ్లు భౌతికదూరం పాటిస్తూ ఆటను కొనసాగిస్తే మంచిదని కోరుతున్నా. ప్రస్తుతం కరోనా సోకిన క్రీడాకారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. మళ్లీ మాములు పరిస్థితి చేరుకుంటారు.’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇయాన్ బోథమ్ ఇంగ్లండ్ తరఫున 102 టెస్టుల్లో 5200 పరుగులు , 116 వన్డేల్లో 2113 రన్స్ చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఈ ఇంగ్లండ్ ఆటగాడు టెస్ట్‌ల్లో 383, వన్డేల్లో 145 వికెట్లు పడగొట్టాడు.