వెంకయ్య నాయుడికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష

వెంకయ్య నాయుడికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష

ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 72 గంటల ముందు ఎంపీలంతా కరోనా టెస్టు చేసుకోవాలని వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలకు కరోనా నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరి అన్నారు. ప్ర‌భుత్వం ఆమోదించిన ఆస్ప‌త్రులు, లాబోరేట‌రీలు, పార్ల‌మెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన టెస్ట్ సెంట‌ర్‌లో ప‌రీక్ష‌లు చేయించుకుని రిపోర్టు స‌మ‌ర్పించాలన్నారు. పార్లమెంటు అధికారులు, సిబ్బంది కరోనా పరీక్షలు చేసుకోవాలని, డీఆర్‌డీవో ద్వారా ఎంపీలకు కరోనా ప్రత్యేక కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా ఎలక్ట్రానిక్‌ మోడ్‌లో పార్లమెంట్‌ బిజినెస్‌ పేపర్లు ఉండనున్నాయని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈనెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతాయి. శని, ఆదివారాలు సహా మొత్తం 17 రోజుల పాటు నిరవధికంగా ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలు రోజుకు నాలుగు గంటలు మాత్రమే జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ సమావేశాలు జరిగితే, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు లోక్‌సభ సమావేశాలు కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌తో నేపథ్యంలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నిర్వహణ కోసం అధికారులు ఉభయ సభల్లోను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.