ఓ మహిళగా మీకు కోపం రావడం లేదా…..

ఓ మహిళగా మీకు కోపం రావడం లేదా.....

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కి, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కంగనా కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. ఇప్పటికే శరద్‌ పవార్‌.. ఈ విషయమై శివసేన మీద గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ సారి మ‌హరాష్ట్ర‌ సంకీర్ణ ప్ర‌భుత్వంలో భాగంగా ఉన్న కాగ్రెస్‌ను కంగనా టార్గెట్ చేశారు. ఆ పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీని ఉద్దేశిస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు. ఓ మహిళ పట్ల మీ భాగస్వామ్యంలోని ప్రభుత్వ తీరుపై మీరు స్పందిచకపోవడం విచారకరం.. మీ మౌనాన్ని చరిత్ర గమనిస్తోంది అంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు కంగనా.

ఈ సందర్భంగా కంగనా ‘గౌరవనీయులైన కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ గారు.. మహారాష్ట్ర ప్రభుత్వం నన్ను వేధింపులకు గురి చేస్తోన్న విషయం చూసి ఓ మహిళగా మీకు కోపం రావడం లేదా.. అంబేడ్కర్‌ మనకిచ్చిన ఆదర్శాలను పాటించాల్సిందిగా మీ ప్రభుత్వాన్ని అభ్యర్థించలేరా.. మీరు పశ్చిమ దేశంలో పెరిగారు.. కానీ భారతదేశంలో జీవించారు. ఆడవారు ఎదుర్కోనే సమస్యల గురించి మీకు అవగాహన ఉండే ఉంటుంది. ఈ రోజు మీ భాగస్వామ్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఓ మహిళను వేధింపులకు గురి చేస్తూ.. శాంతి భద్రతలను పూర్తిగా అపహాస్యం చేస్తోంటో మీరు మౌనంగా.. ఉదాసీనంగా ఉన్నారు.

చరిత్ర తప్పక మీ మౌనాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పటికైన మీరు జోక్యం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను’ అంటూ కంగనా ట్వీట్‌ చేశారు. అలానే శివసేన పార్టీపై కూడా నిప్పులు చెరిగారు కంగనా. ‘నాకు చాలా ఇష్టమైన స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో బాలా సాహెబ్‌ ఠాక్రే ఒకరు. ఆయన ఈ రోజు శివసేన కాంగ్రెస్‌లో విలీనమవుతుందని భయపడుతున్నారు. ఈ రోజు తన పార్టీ పరిస్థితిని చూసి ఆయన ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని నేను భావిస్తున్నాను’ అంటూ మరో ట్వీట్‌ చేశారు కంగనా. అంతేకాక శివసేనను ‘సోనియా సేన’గా వర్ణించారు.