తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పడికే పలువురు మహమ్మారి బారిన పడగా తాజాగా మరో 6 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 925 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ప్రకటించింది. వ్యాధి సోకిన వారిలో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఒకరు మెదక్, మరొకరు రంగారెడ్డికి చెందిన వారు ఉన్నారని చెప్పారు. మరో 54 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 19 యాక్టివ్ కేసులు ఉండగా ఒకరు రికవరీ అయ్యారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే న్యూ వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని హెచ్చరిస్తున్నారు. ప్రజలు కరోనా నిబంధనలు స్వచ్ఛందంగా పాటిస్తే మరో ముప్పు వాటిల్లకుండా జాగ్రత్త పడినవారమవుతామని తెలిపారు. మాస్కు ధరించడం, తరచూ చేతులు శానిటైజర్తో శుభ్రపరుచుకోవడం వంటివి చేయాలని సూచించారు.