కర్ణాటకలో కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తోంది. ఆదివారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 614కు చేరుకుంది. ఇక వారం రోజుల క్రితం గ్రీన్ జోన్‌గా ప్రకటించబడిన దావణగెరెలో ఆదివారం ఒక్కరోజే 21 మందికి వైరస్ సోకడంతో కలకలం రేగింది. ఈ విషయం గురించి జిల్లా డిప్యూటీ కమిషనర్ మహంతేశ్ బెలాగి మాట్లాడుతూ.. మే 1, 2 తేదీల్లో కరోనా లక్షణాలు ఉన్న 72 మంది శాంపిళ్లు.. ఆదివారం రోజు 164 మంది శాంపిళ్లు పరీక్షకు పంపగా.. వారిలో 21 మంది కరోనా బారిన పడినట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో పర్యవేక్షణాధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారని.. వారికి కరోనా ఎవరి ద్వారా సోకిందనే విషయంపై విచారణ చేస్తున్నారని వెల్లడించారు.
కాగా దావణగెరె జిల్లాలో అంతకుముందు 10 కరోనా కేసులు నమోదు కాగా.. వారిలో ఇద్దరు కోలుకున్నారు. ఒకరు మరణించారు. కొన్ని రోజులుగా యాక్టివ్ కేసులు లేకపోవడంతో దావణగెరెను గ్రీన్‌జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాను రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చి.. లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం నాటికి రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 614 మంది కరోనా బాధితుల్లో 287 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా… మొత్తంగా 25 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇక దేశంలో తొలి కరోనా మరణం కర్ణాటకలో సంభవించిన విషయం తెలిసిందే.