జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కోర్టు సమన్లు జారీ అయ్యాయి. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు 3వ అదనపు జడ్జి ఈ సమన్లను జారీ చేశారు. ఈ నెల 24న స్వయంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ కోర్టుకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సినీ నటి శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పవన్ తన విషయంలో చేసిన కొన్న వ్యాఖ్యల పట్ల ఆమె మండిపడ్డారు. పవన్ తల్లిని కించపరిచేలా ఓ పదాన్ని వాడారు.
ఈ ఘటనకు సంబంధించి మీడియా చానళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి 23 వరకు పవన్ కల్యాణ్ వరుసగా అనుచిత ట్వీట్లు చేశారు. తన తల్లిని ఎవరో దూషించిన విషయాన్ని ఉపయోగించుకుని రాధాకృష్ణ మైలేజీ పొందాలనుకున్నారంటూ పవన్ విమర్శించారు. కొన్ని ఫొటోలను, కొన్ని మార్ఫ్ చేసిన వీడియోలు కూడా అప్ లోడ్ చేశారు. దీంతో, పవన్ కు తన లాయర్ ద్వారా రాధాకృష్ణ నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే, ఈ నోటీసులకు పవన్ స్పందించకపోవడంతో… రాధాకృష్ణ ఆయనపై రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.